Telangana MLA Tickets
Telangana MLA Tickets : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో టికెట్ల లొల్లి నెలకొంది. ఆ రెండు పార్టీల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు భగ్గుమంటున్నారు. మాకు అన్యాయం జరిగింది అంటూ రగిలిపోతున్నారు. కొందరు పార్టీ జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. మరికొందరు రెబల్ గా బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఇంకొందరు రోడ్డెక్కి నిరసనకు దిగారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ టికెట్ పై మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ స్పందించారు. పార్టీలో నాకు అన్యాయం జరిగింది ఆయన వాపోయారు. జడ్చర్ల నుంచి రెబల్ గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిగా జడ్చర్లలో ఉన్న క్యాడర్ పై నమ్మకం ఉందన్నారు. కచ్చితంగా రెబల్ గా పోటీ చేసి గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు ఎర్రశేఖర్.
Also Read : మళ్లీ కేసీఆర్ రాకుంటే.. అమరావతిలా హైదరాబాద్- మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
అటు ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో 9మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతల సమావేశం అయ్యారు. బోథ్ టికెట్ ను వన్నెల అశోక్ కి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు నియోజకవర్గ ముఖ్యనేతలు.
అటు తన అనుచరులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బెల్లంపల్లి కొయ్యేలా ఏమాచి నిరసనకు దిగారు. మాజీ ఎంపీ వివేక్ కుట్ర పన్ని బెల్లంపల్లి టికెట్ తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. తన అన్న వినోద్ ను కాంగ్రెస్ నుండి బెల్లంపల్లి నియోజకవర్గంలో గెలిపించడం కోసమే శ్రీదేవికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఇటీవలే బీజేపీలోకి వచ్చారని, నేను గత ఎనిమిదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానని, ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించాలని బీజేపీ నేత బెల్లంపల్లి కొయ్యేలా ఏమాచి కోరారు.
ఇక, జూబ్లీహిల్స్ టికెట్ విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరుల గాంధీభవన్ లో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేత విష్ణువర్దన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. అయితే, ఆ టికెట్ ను మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. దాంతో విష్ణువర్దన్ రెడ్డి కంగుతిన్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న(అక్టోబర్ 27) 45మందితో సెకండ్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కచ్చితంగా జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని విష్ణువర్దన్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు షాక్ ఇచ్చింది.
Also Read : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఇటీవలే పార్టీలో చేరి టికెట్లు దక్కించుకున్న వారు వీరే
ఇలా కాంగ్రెస్, బీజేపీలలో టికెట్ల లొల్లి పీక్స్ కి చేరింది. టికెట్ తమకు ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకులు.. టికెట్ దక్కకపోయేసరికి బాగా అప్ సెట్ అయ్యారు. ఈ క్రమంలో కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో పార్టీలో చేరడమో లేక రెబల్ గా బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం వంటివి చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో రాజకీయం హీటెక్కింది.