modified silencers crushed
Sircilla – Modified Silencers: రాజన్న సిరిసిల్లా జిల్లా (Rajanna Sircilla district) పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. మోడిఫైడ్ సైలెన్సర్ల (modified silencers)తో న్యూసెన్స్ చేస్తున్న వారికి చెక్ పెట్టారు. చెవులు చిల్లులు పడే శబ్దాలతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ”సౌండ్” బాబుల పనిపట్టారు. బైకు సైలెన్సర్లు ఇష్టమొచ్చినట్టు మార్చేసి అత్యధిక శబ్దంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పారు. రోడ్లపై పెద్ద పెద్ద సౌండ్లు (high sound) చేస్తూ దూసుకుపోతున్న వారి బైకులు స్వాధీనం చేసుకుని, జరిమానాలు విధించారు. సీజ్ చేసిన బైకుల నుంచి సైలెన్పర్లు తొలగించి, ధ్వంసం చేశారు.
ఈ మధ్య కాలంలో వాహనాలకు సైలెన్సర్లు మార్చేసి ఎక్కువ సౌండ్లు చేయడం ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా బైకులకు అత్యధిక శబ్దాలతో కూడిన సైలెన్సర్లు బిగించి రోడ్లపై కొంత మంది హల్ చల్ చేస్తున్నారు. భారీ శబ్దాలతో సాటివారిని ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా శబ్దకాలుష్యాన్ని కలిగిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, హృద్రోగులు.. ఇలాంటి సౌండ్లతో హడలిపోతున్నారు. రోడ్డుకు మీదకు రావాలంటనే భయపడుతున్నారు. మోడిఫైడ్ సైలెన్సర్లతో న్యూసెన్స్ చేస్తున్న వారిని ఎప్పటికప్పుడు గుర్తించి పోలీసులు చర్యలు చేపడుతున్నా.. పూర్తిస్థాయిలో నివారించలేకపోతున్నారు.
Also Read: జులై 11న తిరుమలలో ఐదు గంటలపాటు శ్రీవారి దర్శనాలు నిలిపివేత
తాజాగా సిరిసిల్ల పోలీసులు వినూత్నంగా స్పందించారు. సిరిసిల్ల పట్టణంలో మంగళవారం జనంతా చూస్తుండగా అంబేద్కర్ చౌరస్తాలో సైలెన్పర్లను రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు పోలీసులు. ప్రజలంతా ఈ వినూత్న కార్యక్రమాన్ని వింతగా చూశారు. సీజ్ చేసిన మోడిఫైడ్ సైలెన్సర్లను పోలీస్ స్టేషన్ వెలుపల.. లేదంటే ఖాళీ ప్రాంతాల్లో పోలీసులు ధ్వంసం చేస్తుంటారు. కానీ సిరిసిల్ల పోలీసులు జనం అందరూ చేస్తుండగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకే ఈవిధంగా చేశారు.
రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో నెల రోజులుగా జిల్లావ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న వాహనాలను పోలీసులు సీజ్ చేసి, జరిమానాలు విధించారు. రెండో సారి పట్టుబడితే కేసు పెట్టి, కోర్టులో హాజరుపరుస్తామని సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య తెలిపారు. మోడిఫైడ్ సైలెన్సర్లను వాహనాలకు అమర్చే మెకానిక్ లపై కేసు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా ”సౌండ్” బాబులు మారతారో, లేదో చూడాలి.