×
Ad

Azharuddin : క్రికెటర్ నుంచి రాజకీయ నేతగా.. అజారుద్దీన్ రాజకీయ ప్రస్థానం సాగిందిలా..

Azharuddin : అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8వ తేదీన హైదరాబాద్ లో జన్మించారు. నిజాం కళాశాల నుంచి బీకాం డిగ్రీ పొందారు.

Azharuddin

Azharuddin : టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ తెలంగాణ క్యాబినెట్ లో చేరబోతున్నారు. మంత్రివర్గంలోకి ఆయన్ను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. శుక్రవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. మైనార్టీ సంక్షేమంతోపాటు మరో శాఖకు అజారుద్దీన్ కు అప్పగిస్తారని సమాచారం.

ప్రస్తుతం ఆయన ఏ చట్టసభలోనూ సభ్యుడిగా లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలల్లో అసెంబ్లీ లేదా మండలి సభ్యత్వం తప్పనిసరి. అయితే, గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ కు శాసన మండలికి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. అజారుద్దీన్ తొలుత భారత జట్టు క్రికెటర్.. జట్టుకు సారథ్య బాధ్యతలు వహించాడు. రిటైర్మెంట్ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8వ తేదీన హైదరాబాద్ లో జన్మించారు. నిజాం కళాశాల నుంచి బీకాం డిగ్రీ పొందారు. 1987లో నౌరీన్‌ను పెళ్లి చేసుకున్న ఆయన కొద్ది సంవత్సరాల తరువాత ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తరువాత సినీనటి సంగీత బిజ్లానీతో అజార్ వివాహం జరిగింది. అయితే, 2010లో సంగీతతో విడాకులు తీసుకున్నారు. 2017లో షానన్ మేరీని పెళ్లి చేశాసుకున్నారు.

1984లో భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన హైదరాబాద్ క్రికెటర్ అజారుద్దీన్.. ఇంగ్లాండ్‌తో ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. 1985లో తొలి వన్డే మ్యాచ్ ఆడారు. 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1984 – 2000 మధ్య 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన అజారుద్దీన్.. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆయన క్రికెట్ కు దూరమయ్యారు. 2012లో కోర్టు ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది.

క్రికెటర్ నుంచి రాజకీయ నేతగా అజారుద్దీన్ ఎదిగారు. 2009లో భారత రాజకీయాల్లో తొలిసారి అడుగు పెట్టారు. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. తొలిసారి యూపీలోని మొరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో రాజస్థాన్ మాథోపూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయన.. 2023లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.