RBL Bank Scam : కరీంనగర్ RBL బ్యాంకులో భారీ స్కాం.. రూ.137 కోట్ల మేర.. నిందితులంతా విద్యార్థులే..
RBL Bank Scam : కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసింది.
more than rs 100 crore massive scam exposed at karimnagar kisan sagar rbl bank
RBL Bank Scam : తెలంగాణలోని ఓ జిల్లాలో భారీ స్కాం వెలుగుచూసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ కేసులో నిందితులంతా డిప్లొమా, ఇంజినీరింగ్ విద్యార్థులే. కరీంనగర్ జిల్లా కిసాన్‌నగర్ ఏరియాలో ఉన్న ఆర్బీఎల్ (RBL) బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగుచూసింది. సుమారు రూ. 137 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు గుర్తించారు. 7 మ్యూల్ (Mule) ఖాతాల ద్వారా ఇంత భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు నిర్ధారించారు. బండారి సాయిరామ్ అనే స్థానికుడు, చైనా వ్యక్తులతో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితులు ఫేక్ అకౌంట్లు తెరిచి డబ్బులు మళ్లించి ఇంత భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలిసింది.
ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సాయిరామ్.. ప్రతి లావాదేవీపై క్రిప్టో కరెన్సీ ద్వారా 2 శాతం కమిషన్ తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం 8 కేసుల్లో 13 మంది నిందితులను అరెస్టు చేసినట్లు కరీంనగర్ సీపీ తెలిపారు. “ఈ స్కామ్‌లో నిందితులకు సుమారు రూ. 2 కోట్ల వరకు కమిషన్ వచ్చింది. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0లో భాగంగా ఈ మ్యూల్ ఖాతాల నెట్‌వర్క్‌ను ఛేదించాం. ఈ కేసులో ముఖ్యంగా డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులే నిందితులుగా ఉన్నారు” అని ఆయన తెలిపారు.
