Munugode Assembly Constituency : ఒక్క ఏడాదిలో రెండుసార్లు ఎన్నిక జరిగే నియోజవర్గం ఏదైనా ఉందంటే.. అది మునుగోడు మాత్రమే.. ఎనిమిది నెలల క్రితం ఉప ఎన్నిక జరిగిన మునుగోడులో మరో ఐదు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీఆర్‌ఎస్ మళ్లీ జెండా ఎగరేస్తుందా? ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా? కాంగ్రెస్ నుంచి జంప్ చేసి ఉప ఎన్నికల (Munugode bypoll)కు కారణమైన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajgopal Reddy) ఇప్పుడేం చేస్తున్నారు? రాజగోపాల్ మళ్లీ కమలం అభ్యర్థేనా? క్రాస్ ఓటింగ్‌తో నష్టపోయిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? రానున్న ఎన్నికల్లో మునుగోడులో కనిపించే సీనేంటి?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సాధారణ ఎన్నికలు రసవత్తరం జరిగేలా కనిపిస్తోంది. గత నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా జరిగిన పోరు.. మళ్లీ పునరావృతమయ్యేలా ఉందని అందున్నారు. మునుగోడు అసెంబ్లీకి తొలిసారిగా 1967లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సీపీఐ, రెండు సార్లు బీఆర్ఎస్ విజయం సాధించాయి. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్, వామపక్షాలకు సమానంగా ఆదరిస్తోంది. కాంగ్రెస్ నుంచి దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (Palvai Govardhan Reddy) ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్, చౌటుప్పల్, నారాయణపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. గతంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పోటీ జరిగే మునుగోడులో బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత సీన్ మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కలమం పార్టీ స్ర్టాంగ్‌గా మారింది. చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల్లో బీజేపీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్ మండలాల్లో సీపీఎం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో సీపీఐ ప్రభావం చూపుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 41 వేల 367 ఓటర్లు ఉండగా, పురుషులు లక్ష 21 వేల 501 మంది, మహిళలు లక్ష19 వేల 859 మంది ఉన్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ.
Kusukuntla Prabhakar Reddy
సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) ఆరు నెలల క్రితం జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మునుగోడును దత్తత తీసుకుంటానన్న ప్రకటించిన మంత్రి కేటీఆర్ యోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే ఉప ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికల్లో సొంతం పార్టీ నుంచే తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే తీవ్ర ఉత్కంఠ రేపిన ఉపపోరులోనే తనకు టిక్కెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. సాధారణ ఎన్నికల్లోనూ అవకాశమిస్తారని ఆశలు పెట్టుకుంటున్నారు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి.
ఉపఎన్నికల సమయంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్లంతా సాధారణ ఎన్నికలపై ఆశలు పెంచుకుంటున్నారు. మునుగోడు జడ్పిటీసీ సభ్యురాలి భర్త నారబోయిన రవి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మునుగోడు బీఆర్‌ఎస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ నేతలంతా వివిధ కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ సైతం టికెట్ను ఆశిస్తున్నారు. ఆశావాహుల్లో ఒకరైన నారబోయిన రవికి పార్టీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే టాక్ నడుస్తోంది.
Komatireddy Rajgopal Reddy
ఇక గత ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ ఇచ్చిన బీజేపీ బలం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. 8 నెలల ముందు వరకు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతోనే నియోజకవర్గంలో బీజేపీ పురుడుపోసుకుంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తగత ప్రభావం తప్పితే.. బీజేపీకి బలం లేదని.. ఉపఎన్నికల్లో ఇచ్చిన పోటీ.. సాధారణ ఎన్నికల్లో ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. సాధారణ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ప్రభావం అంతగా పనిచేయకపోవచ్చని.. ఉప ఎన్నికల్లో జరిగినట్లు కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లడం జరగదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారన్న చర్చ నడుస్తోంది. ఈ ప్రచారాన్ని రాజగోపాల్ రెడ్డి ఖండిస్తున్నా.. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి ఈ సారి మునుగోడు నుంచి పోటీ చేయకపోవచ్చని.. ఆయన వేరే నియోజకవర్గం చూసుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతుండటం బీజేపీ కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేస్తోంది. అయితే ఇవన్నీ తన వ్యతిరేకుల ప్రచారమని.. మునుగోడు నుంచే రాజగోపాల్‌రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని.. కచ్చితంగా విజయం సాధిస్తారని ఆయన వర్గం చెబుతున్నారు.
Palvai Sravanthi
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఉపఎన్నికల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. తమ పార్టీ నేత బీజేపీలోకి వెళ్లడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. సాధారణ ఎన్నికల్లో పరిస్థితి మారుతుందని ఆశిస్తోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమే పోటీ ఉంటుందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతి ఉన్నప్పటికీ.. తాను కూడా నియోజకవర్గ ఇన్‌చార్జినేనని ప్రముఖ కాంట్రాక్టర్ చల్లమల్ల కృష్ణారెడ్డి చెప్పుకుంటున్నారు.
Punna Kailash Netha
మరోవైపు బీసీ ఓట్లు దృష్టిలో పెట్టుకుని తనకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కైలాష్ నేత (Kailash Netha) ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ క్యాడర్ మాత్రం పాల్వాయి స్రవంతి వెంటే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడిన చల్లమల కృష్ణారెడ్డి, బీసీకార్డుతో కైలాష్ నేత కూడా క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ట్రోలింగ్ విషయంలో చల్లమల కృష్ణారెడ్డి పేరు బయటకు రావడంతో.. పార్టీలో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయని చెబుతున్నారు. ఏదైనా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Also Read: కోదాడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ.. తానే పోటీ చేస్తానని చెబుతున్న కాంగ్రెస్ నేత..
ప్రధాన పార్టీలు ఆశలు భారీగా ఉండగా, పొత్తుల్లో మునుగోడును తీసుకోవాలని కమ్యూనిస్టులు పావులు కదుపుతున్నారు. 2014 వరకు కాంగ్రెస్ లో పోటీపడిన కమ్యూనిస్టులు ఆరు నెలల క్రితం జరిగిన ఉపఎన్నికల్లో బిఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్ మండలాల్లో సీపీఎం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకుంది. మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరులలో సీపీఐ ప్రభావం చూపుతోంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే.. ఇక్కడి నుంచి పోటీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం భావిస్తున్నారు. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలని కమ్యూనిస్టులు నిర్ణయం తీసుకున్నారు.
Also Read: పక్కా స్కెచ్‌తో నల్లగొండలో కారు పాగా.. ఈసారి సత్తా చాటేదెవరు?
ఇలా మునుగోడు రాజకీయం రసకందాయంగా కనిపిస్తోంది. గత నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలు మరచిపోకముందే మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. గెలుపు ఊపు బీఆర్‌ఎస్‌లో ఇంకా తగ్గకపోగా.. కాంగ్రెస్ కర్ణాటక జోష్‌తో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఇక రాజగోపాల్‌రెడ్డి భవిష్యత్ వ్యూహంపైనే బీజేపీ ఆధారపడింది. వామపక్షాలు మాత్రం కుదిరితే పోటీచేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని.. లేదంటే తమతో పొత్తు పెట్టుకునేవారిని గెలిపించాలని ఉవ్వాళ్లూరుతున్నారు. ఓటర్లు మాత్రం ఈ సారి ఎవరికి చాన్స్ ఇస్తారనేది మాత్రం సస్పెన్స్‌గానే మారింది.