Munugode bypoll: మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.500 కోట్లు ఖర్చు చేస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారమని కేటీఆర్ అన్నారు. అంతేగాక, రూ.22 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తేనే బీజేపీలో ఆయన చేరారని టాక్ అని వ్యాఖ్యానించారు. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవని చెప్పారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్ అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల కీలక నేతలు క్షేత్రస్థాయిలో ఉండి ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి వచ్చే సోమవారం నామినేషన్ దాఖలు చేస్తారు. టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించింది. గత ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో మునుగోడులో గెలవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. దీంతో ఈ మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..