Musi Floods
Musi Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కారణంగా మూసీ ఉగ్రరూపందాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత మూసీ నది ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెనపై నుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. బస్టాండ్ లోకి మూసీ వరద చేరడంతో వందల మంది ప్రయాణికులు బస్టాండ్ లో చిక్కుకుపోయారు.
Current situation at MGBS .. pic.twitter.com/4QS6qdKAXG
— మీ కాపలా కుక్క (@mekaapalaKukka) September 26, 2025
మూసీ ఉగ్రరూపం దాల్చడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. అర్ధరాత్రి సమయంలో బస్టాండ్ లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మూసీ ఉధృతి.. ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. అర్ధరాత్రి పరిస్థితిని స్వయంగా రేవంత్ రెడ్డి సమీక్షించారు. బస్టాండ్ వద్ద ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
Musi overflow Near Mgbs, Koti
Be carefull Hyderabad vasiyoooo ✅@revanth_anumula @GHMCOnline #Hyderabadrains #monsoonrains pic.twitter.com/m8xYIPOXW9
— 𝙊𝙓𝙓𝙔🐉🀄️ (@Oxxy_7) September 26, 2025
శుక్రవారం రాత్రి 8గంటల నుంచి ఎంజీబీఎస్ లోకి వరద నీరు చేరుకున్నట్లు ఎంజీబీఎస్ అధికారులు తెలిపారు. ఆ సమయంలో బస్టాండ్ లో సుమారు మూడు వేల మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పెద్దెత్తున వరద బస్టాండ్ ప్రాంతంలో చెట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు పంపించారు. వరద ప్రవాహం దృష్ట్యా ఎంజీబీఎస్ లోపలికి బస్సులను అనుమతించడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను తాత్కాలికంగా మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ వరకు.. అదేవిధంగా కర్నూల్, మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్ వద్ద మళ్లిస్తున్నారు. వరంగల్, హన్మకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే అనుమతిస్తున్నారు. అదేవిధంగా అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను జేబీఎస్ వరకు అనుమతిస్తున్నారు. రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు పికప్ పాయింట్లను మార్చామని ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు.