Pranay Amrutha Case Final Verdict
Amrutha Pranay Case Verdict: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏ2 సుభాశ్ శర్మకు ఉరిశిక్ష విధించిన కోర్టు.. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కాగా ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి అమృతరావు గతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే.
తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ కేసును పోలీసులు విచారణ పూర్తి చేసి 2019లో ఎనిమిది మందిని నిందితులుగా ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుపై సుమారు ఐదేళ్లకుపైగా కోర్టులో విచారణ జరిగింది. ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా కోర్టు తుదితీర్పు ఇచ్చింది. ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది.
ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకొని చనిపోగా.. ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. తీర్పు నేపథ్యంలో నిందితులందరినీ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్ ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. అయితే, సుభాశ్ శర్మకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఏ3 అజ్గర్ అలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ5 ఎంఏ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్ కుమార్ (మారుతిరావు సోదరుడు), ఏ7 సముద్రాల శివ (మారుతిరావు డ్రైవర్), ఏ8 నజీమ్ (నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)కు కోర్టు జీవిత ఖైదు విధించింది.