occult worship in the cemetery four youths arrested : యువత ఓ పక్క టెక్నాలజీపరంగా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. మరోపక్క మూఢనమ్మకాలు పట్టుకుని వేళాడుతున్నారు. ఇక్కడ మరోక విశేషమేమంటే ఆ మూఢ నమ్మకాలను ఫాలో అవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవటం…!!
ఆన్‌లైన్‌లో క్లాసులు నేర్చుకున్నట్లే..నలుగురు యువకులు ఆన్‌లైన్‌లో క్షుద్రపూజలు ఎలా చేయాలి? దానికి కావాల్సిన వస్తువులేంటీ? ఏఏ సమయంలో ఎక్కడ ఎటువంటి సమయంలో చేయాలి? క్షుద్రపూజలు చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు జపించాలి? అనే విషయాలను ఆన్ లైన్ లో నేర్చుకున్నారు. ఆ తరువాత చక్కగా అర్థరాత్రి శ్మశానంలో క్షుద్రపూజలు చేస్తు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో చోటు చేసుకుంది.
గోవిందపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులకు క్షుద్రపూజలు నేర్చుకోవాలని అనుకున్నారు. అవి చేస్తే తాము మంచి ఉన్నతస్థితిలోకి చేరుకుంటామని నమ్మారు. దీంతో క్షుద్రపూజలు ఎలా చేయాలో ఆన్ లైన్ లో నేర్చుకున్నారు. అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి పసుపు,కుంకుమ,నిమ్మకాయలు పట్టుకుని వెళ్లి ఏవేమో ముగ్గులు వేసి..ఫోన్ లో ఎవరో మంత్రాలు వినిపిస్తుంటే వాటిని విని వారు మంత్రాలు పఠిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్తులు శ్మశానంలో యువకులును చూసి షాక్ అయ్యారు.
అర్ధరాత్రివేళ వాళ్లు శ్మశానంలో ఏం చేస్తున్నారని దగ్గరకు వెళ్లి చూశారు. క్షుద్రపూజలు చేస్తున్నండగా చూసి మరింత షాక్ అయ్యారు. వెంటనే స్థానికులకు ఫోన్ చేసి వారిని కూడా రప్పించారు. వారందరూ వచ్చాక ఆ నలుగురు యువకుల్నిఇక్కడ ఏం చేస్తున్నారని యువకులను నిలదీశారు. .
దానికి సమాధానంగా మా ఇళ్లల్లో సమస్యలున్నాయి..అవి తొలగిపోవడానికి పూజలు చేస్తున్నామని చెప్పారు. ఆ నలుగురు యువకుల్లో ఇట్టి రాము.. అనే ఒక యువకుడు తన అత్తగారి ఫొటోతో పాటు, మరో అమ్మాయి ఫొటో ఉంచి క్షుద్రపూజలు చేసినట్లు ఆధారాలు లభించాయి. రెండు నల్లటి కోళ్లు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, తాయత్తులు, వేపకొమ్మలు వంటివి అక్కడ దొరికాయి.
వారికి ఎవరో ఫోన్‌లో మంత్రాలు చదివి వినిపిస్తుంటే వీళ్లు అవే మంత్రాలు బిగ్గరగా చదువుతూ ఆ ఫొటోలపై పసుపు, కుంకుమ చల్లుతూ రెండు కోళ్లను బలిచ్చినట్లు అంగీకరించారు. దీంతో స్థానిక పెద్దలు పోలీసులకు సమాచారం అందించి జరిగిన విషయం అంతా చెప్పారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ నలుగురు యువకులపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారికి మంత్రాలు వినిపించే వ్యక్తి ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అనేకోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.