Bhadradri Kothaguedem : భద్రాద్రి జిల్లాలో తల్లీబిడ్డ మృతి ఘటనలో కొత్త కోణం.. వనజ కడుపులోకి కత్తెర ఎలా వచ్చింది..? 

Bhadradri Kothaguedem District: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ తల్లి, పురిటి బిడ్డ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో తాజాగా కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.

Bhadradri District Mother Infant Death Case Surgical Scissors Found

  • భద్రాద్రి జిల్లాలో తల్లీబిడ్డ మృతి ఘటనలో కొత్త అనుమానం
  • వనజ చితాభస్మంలో సర్జికల్‌ కత్తెర
  • సర్జరీ చేయకుండా వనజ కడుపులోకి కత్తెర ఎలా వచ్చింది?

Bhadradri Kothaguedem Case Updates : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ తల్లి, పురిటి బిడ్డ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. గుండాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారిని సస్పెండ్ చేసింది. తాజాగా ఈ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. వనజ చితాభస్మంలో సర్టికల్ కత్తెర లభ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది.

Also Read – Registration services suspended : ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్.. ఈ తేదీల్లో సేవలు బంద్.. కారణం ఇదే..

భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన దాట్ల వనజ (20)కు గత ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. 108 కు ఫోన్ చేయగా.. అప్పటికే అంబులెన్స్ మరోకేసులో వేరే ప్రాంతానికి వెళ్లడంతో మరో అంబులెన్సు ఆళ్లపల్లి మండలం నుంచి వచ్చేసరికి ఆలస్యం అయింది. ఆ తరువాత వనజను గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో వైద్యాధికారి అందుబాటులో లేకపోవటంతో ఆ నర్సే ప్రసవం చేసింది. అయితే, శిశువులో కదలిక లేకపోవడంతో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. శిశువు పురిట్లోనే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. మరోవైపు వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది.

ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. గుండాల వైద్యాధికారి సుదీప్ ను సస్పెండ్ చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వనజ మృతదేహానికి సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు నిర్వహించారు. గురువారం ఉదయం కొందరు వనజ చితాభస్మాన్ని ఎత్తిపోసేందుకు వెళ్లారు. ఆ చితాభస్మంలో శస్త్రచికిత్సలో వినియోగించే ఓ కత్తెర లభ్యమైంది. అయితే, వనజకు ఆపరేషన్ కాలేదని, రక్తస్రావం మాత్రమే జరిగిందని వైద్యులు చెబుతుండగా.. ఆ కత్తెర ఎలా వచ్చిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రక్తస్రావాన్ని ఆపేందుకు కత్తెర సాయంతో దూది పెట్టారా..? లేక కడుపులో పొర తొలగించే క్రమంలో కత్తెర మర్చిపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. వనజ మృతికి ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందే కారణమని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.