New Year celebrations
Hyderabad : 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు హైదరాబాద్ నగర ప్రజలు సిద్ధమయ్యారు. ఇప్పటికే రిసార్ట్స్, పబ్బులు, పలు ప్రాంతాల్లో న్యూఇయర్ వేడుకలకోసం ఏర్పాట్లు చేశారు. అయితే, న్యూఇయర్ వేళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 31వ తేదీ రాత్రి 11గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 2గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఫ్లైట్ టికెట్ ఉన్నవారికే ఎక్స్‌ప్రెస్ హైవేపైకి అనుమతి ఉంటుంది.
బేగంపేట, టోలీచౌకీ ప్లైఓవర్ మినహా మిగిలిన ప్రాంతాల్లోని ఫ్లైఓవర్లన్నీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు అవసరాన్ని బట్టి బంద్ చేస్తామని పోలీసులు తెలిపారు. అన్ని ప్రైవేట్ వాహనాలు సిటీలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.
ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్ వంటి చోట్ల 31వ తేదీ రాత్రి 11గంటల నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్లు తెలిపారు.
మద్యం తాగి వాహనాలు నడపొద్దని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి ఎనిమిది గంటల నుంచే కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు..
న్యూఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. 31వ తేదీ అర్ధరాత్రి 1గంట వరకు మెట్రో సేవలను పొడిగించినట్లు తెలిపారు. సాధారణంగా రాత్రి 11గంటలకే చివరి మెట్రో ప్రారంభ స్టేషన్ల నుంచి బయలుదేరుతుంది. న్యూఇయర్ వేడుకల సందడిని ఆస్వాదించి సురక్షితంగా గమ్యస్థానం చేరేందుకు వీలుగా 31వ తేదీ అర్ధరాత్రి 1గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి.