Telangana BJP chief: ఎంతకీ కొలిక్కిరాని తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపిక.. ఎందుకంటే?

ఈటల రాజేందర్, రఘునందర్ రావు, డీకే అరుణ లాంటి నేతలు అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.

Kishan Reddy

క్లైమాక్స్‌లో ట్విస్టులు..ఎండ్‌ కార్డ్‌ పడే సమయంలో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన లెవల్‌లో.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి..పొలిటికల్ పిక్చర్‌ను తలపిస్తోంది. ఆల్మోస్ట్ స్టేట్ చీఫ్ సెలెక్షన్‌ కంప్లీట్ అయిందని..ఏ క్షణమైనా కాషాయ రథసారధి ఎంపికపై ప్రకటన వస్తుందని..రెండు మూడు నెలలుగా ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ చీఫ్ ఎంపిక ఎటూ తేలడం లేదు. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నేతలు తీరు ఉండటంతో అందరినీ కలుపుకుపోయే నాయకుడి కోసం అధిష్టానం జల్లెడ పడుతోందట.

ఫలానా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని కచ్చితంగా ముఖ్యనేతలు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదే కన్ఫ్యూజన్ బీజేపీ హైకామాండ్‌లోనూ నెలకొందట. ఎందుకంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదివిని ఆశిస్తున్నవారి సంఖ్య పెద్దగానే ఉంది. పైగా రోజు రోజుకు ఆశావహులు పెరుగుతూ పోతున్నారు.

పార్టీలో పాత నేతలు, కొత్తగా వచ్చిన నేతలు, దూకుడుగా వ్యవహరించే లీడర్స్..ఇలా రకరకాల ఈక్వేషన్స్‌తో ఎవరికి వారే అధ్యక్ష పదవి తమకేనని చెప్పుకుంటున్నారు. అధిష్టానం తమవైపే మొగ్గుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అనుకూలతలు వాళ్ళు చెప్పుకుంటూ..ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం తమకే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు బీజేపీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారిందట. పార్టీలో గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు ఈ కొత్త సంప్రదాయం ఏంటని వాపోతున్నారట.

వీళ్ల పేర్లు తెరపైకి..
బీజేపీ స్టేట్‌ చీఫ్ రేసులో బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుకు తోడు ఇప్పుడు కొత్తగా రామచందర్ రావు, ఆచారి లాంటి వాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఎవరికి వారు ఆర్ఎస్ఎస్ నేతలతో, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, కేంద్రమంత్రులతో, బీజేపీ కేంద్ర పెద్దలతో ఉన్న పరిచయాలతో లాబీయింగ్ చేస్తున్నారట. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవి ఫలానా క్వాలిటీస్ ఉన్నవారికే ఇవ్వాలని ఓ వర్గం చెబుతుంటే.. క్వాలిటీస్ కాదు సీనియారిటీ ఇంపార్టెంట్ అన్నది మరొవర్గం వాదనట.

ఇలా నేతలు ఎవరికి వారే తమ ప్రాధాన్యతల్ని కొత్త అధ్యక్ష పదవి మీద రుద్దే ప్రయత్నం చేయడంతో అసలేం జరుగుతోందో అర్ధంకాని డైలమాలో పడిపోయిందట బీజేపీ హైకమాండ్. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవిని ఒకరికిస్తే మరొకరి అసంతృప్తి తప్పదు..ఒక వర్గానికి ఇస్తే మరో వర్గం ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి రేసులో ఎంపీల పేర్లే వినిపిస్తున్నాయి కాబట్టి ఎంపీల్లో ఎవరికో ఒకరికి ఇచ్చినా చివరికి వాళ్లలో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట.

బండి సంజయ్‌కి మళ్లీ అవకాశం ఇస్తే ఈటల రాజేందర్ అలకబూనే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పోనీ ఈటలకు ఛాన్స్ ఇస్తే పార్టీలోని పాతవర్గం అసంతృప్తి చెందుతుందని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొత్తవారికి ఇస్తే పాత వారితో పంచాయతీ.. అలా కాదని పాత వాళ్ళకు ఇస్తే మా సంగతేంటన్నది కొత్త నాయకుల ప్రశ్న. దీంతో అందరి ఆమోదంతో కాకున్నా మెజార్టీ నేతల సమ్మతితో అధ్యక్ష ఎంపికచేద్దామన్నా కమలం పార్టీ హైకమాండ్‌కు ఎటూ పాలుపోవడం లేదట.

ఎవరెవరు నామినేషన్స్ వేస్తారు?
ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు, ఎవరికి వారి ఎక్స్ పెక్టేషన్స్, లాబీయింగ్‌తో సిచ్యువేషన్ త్రిశంకు స్వర్గంలో పడిపోయిందట. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే వారం రోజుల్లో హైదరాబాద్ రానున్నారని తెలుస్తోంది. ఆమె ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్స్‌ తీసుకుంటారని అంటున్నారు. దీంతో ఎవరెవరు నామినేషన్స్ వేస్తారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పుతారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.

గతంలో బీజేపీ అధ్యక్ష ఎంపిక అంటే ప్రతీ రెండేళ్లకోసారి మార్చేవారు. ఒక్కోసారి ఒకే నేతను రెండు టర్మ్‌లు కంటిన్యూ చేసేవారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యే వరకు కూడా అలాగే ఉండేది. అధిష్టానం ఓ నేత పేరును ప్రకటించేది. అందరూ ఆయన సారధ్యంలోనే పనిచేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త డిఫరెంట్‌గా ఉంది.

తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని.. ఒకవేళ పవర్‌లోకి రాకపోయిన కీరోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్న నేతలంతా..బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. అందులో ఈటల రాజేందర్, రఘునందర్ రావు, డీకే అరుణ లాంటి నేతలు అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొత్త, పాతల పంచాయతీతో కాషాయ రథసారధి ఎంపిక ఎటూ తేలడం లేదంటున్నారు. వచ్చే నెలలో అయినా అధ్యక్ష ఎంపిక కొలిక్కి వస్తుందా రాదా అనేది చూడాలి మరి.