Balka Suman : బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకి తరలింపు..
Balka Suman : బాల్క సుమన్ కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
14 day remand for balka suman and nampally police shift him to chanchalguda jail
Balka Suman : సింగరేణి కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో బాల్క సుమన్‌కు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆ తర్వాత పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నాంపల్లి పోలీసులు శనివారం ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వెంటనే ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
బాల్క సుమన్ అరెస్టు సమయంలో భారీ హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన్ని అరెస్టు చేసే సమయంలో తెలంగాణ భవన్ లోపల బీఆర్ఎస్ కార్యకర్తలు, లాయర్లు.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారంటూ బాల్క సుమన్ న్యాయవాదులు, బీఆర్ఎస్ ప్రతినిధులు ప్రశ్నించారు. బాల్క సుమన్‌పై నమోదైన సెక్షన్లు నాన్‌బెయిలబుల్ కేసులకు సంబంధించినవి కావడంతో.. ముందుగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.
బాల్క సుమన్‌పై సెక్షన్స్ 326(g), 351(3), 353(1)(b), r/w 55, r/w 61(2)(a) BNS, మరియు 4 PDPPA యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న నాంపల్లి పోలీసులు.. సుమారు 6 గంటల పాటు విచారించిన తర్వాత.. కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత పోలీసులు బాల్క సుమన్‌ను హిమాయత్ నగర్‌లోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరిచారు.
అయితే అంతకుముందు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ మరచిపోవడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ లేకుండా రిమాండ్ ఎలా కోరుతారని ప్రశ్నించారు. అనంతరం పోలీసులు అభ్యర్థించడంతో ఎఫ్ఐఆర్ ప్రింట్ తీసి దానికి అటెస్టెడ్ సంతకం పెట్టేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
అరెస్టుకు ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. తనను జైలుకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కుట్ర పన్నారని.. దానిలో భాగంగానే తనను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. తనను జైలులో పెట్టి పైశాచికానందం పొందాలని పాలకులు భావిస్తున్నారని.. ఇవన్నీ గతంలో కాంగ్రెస్ పాలకులు విధించిన ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నాయని అన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తానని తెలిపారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. పార్టీ కార్యక్రమంలోనే ఉన్నానని చెప్పారు.
