No Confidence Motion
No Confidence Motion : తెలంగాణలో ప్రభుత్వం మారగానే.. బీఆర్ఎస్‌కు అవిశ్వాస పంచాయితీలు తలనొప్పిగా మారుతున్నాయి. అనూహ్య పరిణామాలతో స్థానిక నేతలు డైలమాలో పడిపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా అవిశ్వాస తీర్మానాలను ప్రోత్సహిస్తుంటే.. వాటిని డిఫెన్స్ చేసే పనిలో పడింది గులాబీ దళం. పార్టీ లైన్ దాటకుండా ఉండేందుకు అవసరమైన వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేస్తోంది బీఆర్‌ఎస్.
కలవరపెడుతున్న సొంత పార్టీ సభ్యులు..
బీఆర్‌ఎస్‌కు చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతల పదవులకు ఎసరొచ్చి పడింది. ఇన్నాళ్లు జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్లుగా హవా కొనసాగించిన వారంతా ఇప్పుడు అవిశ్వాసాలకు హడలి పోతున్నారు. సంఖ్య ప్రకారం చూస్తే పీఠాలకు ఢోకా లేకపోయినా.. సొంత పార్టీ సభ్యుల తీరే వారిని కలవరపెడుతోంది. కాంగ్రెస్ వెనకుండి అవిశ్వాసాలను నడిపిస్తుండటంతో.. తమ పదవులను కాపాడుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు.
చాలా చోట్ల అవిశ్వాస తీర్మానాలు..
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతతో పాటు జమ్మికుంట, జగిత్యాల మున్సిపల్ చైర్మన్లు తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, గోలి శ్రీనివాస్‌కు అవిశ్వాస గండాలు వచ్చిపడ్డాయి. వీరేకాదు.. జిల్లాలోని చాలా చోట్ల అవిశ్వాస తీర్మానాలు మొదలవుతున్నాయి. తొలి నుంచి బీఆర్‌ఎస్‌లో వివాదాస్పదంగా ఉన్న పుట్ట మధుపై అసంతృప్తితో ఉన్న వారంతా.. అవిశ్వాసం వైపు అడుగులు వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. నష్ట నివారణ చర్యల కోసం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది.
పదవులు చేజారకుండా విప్ జారీ..
అటు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావుకు వ్యతిరేక, అనుకూల వర్గాల క్యాంపు రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అవిశ్వాసం నెగ్గకుండా చేస్తున్నా.. కౌన్సిలర్లు ఎటు సపోర్ట్ చేస్తారన్నది అంచనా వేయలేకపోతున్నారు. ఈనెల 22న ఇరువర్గాలు బల నిరూపణకు సిద్ధమవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ అధిష్టానం.. పదవులు చేజారకుండా విప్ జారీ చేసే యోచనలో ఉంది.
Also Read : ఆ 3 ఎంపీ సీట్లపైనే 3 ప్రధాన పార్టీల గురి.. ఆ మూడు ఏవి అంటే..
నేతల్లో సంతోషం దూరం..
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా.. జగిత్యాల జిల్లాలో మాత్రం కారు జోరు కొనసాగుతోంది. ఇక్కడున్న మూడు స్థానాల్లో రెండింటిని గులాబీ పార్టీ దక్కించుకుంది. కానీ.. తాజా అవిశ్వాసాలు ఆ నేతల్లో సంతోషాన్ని దూరం చేస్తున్నాయి. జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌లో నారాజ్‌గా ఉన్న జడ్పీటీసీ సభ్యుల్లో కొందరు.. ఆయనతో టచ్‌లోకి వెళ్లారని సమాచారం. దీంతో జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ వసంతపై అవిశ్వాసం గ్యారెంటీ అనే ప్రచారం సాగుతోంది.
Also Read : బీఆర్ఎస్‌లో హాట్ సీట్‌గా ఆ పార్లమెంటు నియోజకవర్గం.. సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక, కేసీఆరే పోటీ చేస్తారా?
సొంత పార్టీ వారే షాక్ ఇచ్చారు..
ఇక జగిత్యాల బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌పై.. సొంత పార్టీకే చెందిన 28 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు వినతిపత్రం సమర్పించారు. తొలుత ఇక్కడ బోగ శ్రావణి మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఉండగా.. ఏడాది క్రితం ఆమె రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. దీంతో వైస్ చైర్మన్ శ్రీనివాస్‌కు.. చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయన్ను తొలగించి బీసీ మహిళను చైర్ పర్సన్‌గా నియమించాలని కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు.
బీఆర్ఎస్ ముందున్న ఏకైక అస్త్రం అదే..
ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థుల పదవులను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ వద్ద ఉన్న ఒకే ఒక అస్త్రం విప్ జారీ చేయడమే. అయితే.. అవిశ్వాసాలు ప్రకటించిన బీఆర్‌ఎస్ నేతలకు.. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో గులాబీ దళం జారీ చేసే విప్‌నకు ఎంతమంది కట్టుబడి ఉంటారన్నది వేచి చూడాల్సిందే.