Konda Surekha : ‘నాపై కాదు.. ముందు సీఎంపై చర్యలు తీసుకోండి’.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Konda Surekha : రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకుంటున్నారని అది క్రమ శిక్షణా చర్యల కిందకు రావా? అంటూ సురేఖ మీడియా వేదికగా సూటిగా ప్రశ్నించారు.
- Sreehari A
- Updated on- September 2, 2026 / 04:12 PM IST
Minister Konda Surekha
- బీసీలకు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?
- రాజీనామా అడగలేదు.. సీఎంపైనే ముందు చర్యలు
- కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన అనంతరం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆమె సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకుంటున్నారని అది క్రమ శిక్షణా చర్యల కిందకు రావా? అంటూ సురేఖ మీడియా వేదికగా సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందుగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలన్నారు. తన రాజీనామా కోరుతూ ఇప్పటివరకు ఎవరూ తనను సంప్రదించలేదని కూడా ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
తన కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేసి చర్యలు తీసుకోవడం సరికాదని ఆమె పేర్కొన్నారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని రాహుల్ గాంధీ చెబుతుంటారని, తన కూతురిని రెచ్చగొట్టిన పరిస్థితుల్లోనే ఆమె అలాంటి విమర్శలు చేయాల్సి వచ్చిందని వివరించినట్లు సమాచారం.
బీసీలకు న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? :
అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయంపై సురేఖ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. “బీసీలకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?” అంటూ ప్రశ్నించారు. తన విషయంలో ఒక విధంగానూ ఇతర వర్గాల విషయంలో మరో విధంగా వ్యవహరించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, నేతలపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయని సురేఖ పేర్కొన్నారు. వారి విషయంలో ఎలాంటి సమాధానం చెబుతారు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. తనకు సంబంధించిన అంశాలపై పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే పూర్తి వివరాలను రాతపూర్వకంగా అందజేసినట్టు వెల్లడించారు.
