No Oxygen Shortage in Telangana : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదు..ఈటల

NO Oxygen Shortage in Telangana  :  రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని  తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రానికి 400 టన్నుల ఆక్సిజన్ వచ్చిందని కరోనా పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో 22 ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకున్నామని…కేంద్రం పీఎం కేర్ ఫండ్ ద్వారా వచ్చిన 5 ఆక్సిజన్ సిలిండర్లను సికింద్రాబాద్ లోని గాంధీ, గచ్చిబౌలీ టిమ్స్ ఆస్పత్రి, ఖమ్మం,భద్రాచలం, కరీంనగర్ లో ఒకటి చొప్పున ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఒడిషా నుంచి ఎయిర్ ఫోర్స్ సహాయంతో  ఆక్సిజన్ తెప్పించామని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 3,010 బెడ్లకు ఆక్సిజన్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని..వారం పదిరోజుల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం 500 ఆక్సిజన్ బెడ్లు కొరత ఉందని అయినా ముందు జాగ్రత్త చర్యగా 3,010 బెడ్లు సిధ్దం చేస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోవిడ్ రోగులకు సేవలు అందించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో  ఏప్రిల్ 28 నుంచి ఆక్సిజన్ సదుపాయం ఉన్న 350 బెడ్లు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. నిమ్స్ ఆస్పత్రిలో 200 అదనపు బెడ్లు అందుబాటులోకి వచ్చే ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇతర రాష్ట్రాలలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని మంత్రి చెప్పారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారిని రోజుకు రెండుసార్లు ఆశావర్కర్లతో పరిశీలిస్తున్నామని చెప్పారు. కోలుకుంటున్నపేషెంట్లను సాధారణ పడకలకు మారుస్తున్నామని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు