ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడి… జ్వరాలన్నీ డెంగీ కేసులు కాదు

  • Publish Date - September 6, 2019 / 03:45 AM IST

హైదరాబాద్ లో ప్రస్తుతం జ్వరాల సీజన్‌ కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ డబ్బు కోసం డెంగీ జ్వరం అని చెప్పి రోగులను భయపెట్టడమే కాకుండా  ప్లేట్‌ లెట్స్‌ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని ప్రభుత్వ వైద్యులు ఆరోపిస్తున్నారు. జ్వరం వచ్చిందని హాస్పిటల్ కు వెళ్తే చాలు.. డెంగీ జ్వరం అని చెప్పేస్తున్నారు. 

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మలేరియా విభాగం అధికారి డాక్టర్‌ రాంబాబు, హైదరాబాద్‌ జిల్లా మలేరియా అధికారి నిరంజన్‌ మాట్లాడుతూ… ప్రస్తుత వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఎక్కువగా వైరల్‌ ఫీవర్స్ వస్తున్నాయి.. అన్నీ జ్వరాలు డెంగీ కాదని.. అనవసరంగా భయపడద్దని తెలిపారు. ప్లేట్‌లెట్స్‌ పడిపోయినంత మాత్రాన అది డెంగీ జ్వరం అని  చెప్పలేము. ఇతర కారణాల వల్ల కూడా ప్లేట్‌లెట్స్‌  పడిపోతాయని తెలిపారు.

గడిచిన మూడునెలల్లో హైదరాబాద్ లో కేవలం 488 డెంగీ కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. 90శాతం జ్వరాలు వైరల్‌ ఫీవర్స్‌కు సంబంధించినవే… మిగిలిన వాటిలో డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా తదితర జ్వరాలున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం జరిగిన చిన్నారుల మరణాలు డెంగీ కేసులా.. కాదా అనేదానిపై వైద్యాధికారులతో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

డెంగీ ప్రధాన లక్షణాలు: 
అకస్మాత్తుగా తీవ్ర జ్వరం రావడం.
భరించలేని తలనొప్పి.
కండరాలు, కీళ్లు, ఒంటి నొప్పి.
చర్మంపై దద్దుర్లు.
అధిక దాహం.
 బీపి పడిపోవటం.
వాంతులు.
నిద్రమత్తు.