ఠాగూర్, ఠాక్రేను ఎందుకు మార్చారు?: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

కారు ఇచ్చినవాళ్లైనా మాట్లాడాలి లేదా తీసుకున్నవారైనా మాట్లాడాలి.. అప్పుడే నేను సమాధానం చెబుతా, ఆధారాలు చూపిస్తానని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.

NVSS Prabhakar : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షిపై తాను చేసిన ఆరోపణలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పందించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీపాదాస్ మున్షిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీపాదాస్ మున్షి లేదా ఆమెకు గిఫ్ట్ ఇచ్చిన నేతలు స్పందిస్తేనే తాను సమాధానం చెబుతానని, ఆధారాలు చూపిస్తానని అన్నారు.

అప్పుడే సమాధానం చెబుతా
”కారు ఇచ్చినవాళ్లు, తీసుకున్న వారు మాట్లాడడం లేదు. మధ్యలో వందిమాగధలు పదవుల కోసం మాట్లాడుతున్నారు. జనం తిరస్కరించిన నాయకులు, విలువలు కోల్పోయిన వ్యక్తులు మాట్లాడుతున్నారు. మాణిక్యం ఠాగూర్, మాణిక్‌రావ్‌ ఠాక్రేపై ఆరోపణలు చేసిందెవరు? వీరి మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసిందెవరు? వీరిపై అనేక రకాల వాస్తవాలను బయటపెట్టిందెవరు? ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానమే ఠాగూర్, ఠాక్రేను ఎందుకు మార్చింది? కాంగ్రెస్ హైకమాండ్ సమాధానం చెప్పాలి.

బ్రీఫ్ కేసులు, ల్యాండ్ ట్రాన్స్‌ఫ‌ర్లు, కార్లు తీసుకుని సర్కారుతో పనిచేయించడమే కాంగ్రెస్ సంస్కృతి. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు అవినీతి ఆరోపణలతో అనేక సందర్భాల్లో జైలుకెళ్లారు. ఇన్‌చార్జులుగా ఉన్నవాళ్లు ఇంటికి పోయారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జికి కారు ఇచ్చినవాళ్లైనా మాట్లాడాలి లేదా తీసుకున్నవారైనా మాట్లాడాలి.. అప్పుడే నేను సమాధానం చెబుతా, ఆధారాలు చూపిస్తాన”ని ప్రభాకర్ అన్నారు.

Also Read: కాంగ్రెస్‌లో క్విడ్ ప్రో కో కలకలం.. పదవుల కోసం విలువైన బహుమతులు?

లోక్‌స‌భ‌ ఎన్నికల్లో టికెట్ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపైనా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పందించారు. తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని ఏనాడో పార్టీ అధిష్టానానికి చెప్పానని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నడుస్తున్నాయని అసత్య ఆరోపణలు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. మోదీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, విజయ సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు