కాంగ్రెస్ ఇన్‌చార్జులపై క్విడ్ ప్రో కో మ‌ర‌క‌లు.. దీప్‌దాస్ మున్షీపై బీజేపీ ఆరోపణలు

తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు చూసే ఇన్‌చార్జులు అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారడం విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో కాంగ్రెస్ ఇన్‌చార్జులుగా పనిచేసిన నేతలు క్విడ్ ప్రో కో మ‌ర‌క‌లు అంటించుకుంటున్నారు.

కాంగ్రెస్ ఇన్‌చార్జులపై క్విడ్ ప్రో కో మ‌ర‌క‌లు.. దీప్‌దాస్ మున్షీపై బీజేపీ ఆరోపణలు

bjp telangana leaders allegations on congress incharge deepa dasmunshi

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అప్రతిష్ట పాల్జేసిన క్విడ్ ప్రో కో ఆరోపణలు మళ్లీ కాంగ్రెస్‌ను చుట్టుమడుతున్నాయి. పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షిపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఇంతకు ముందున్న ఇన్‌చార్జులపైనా ఇదేతరహా ఆరోపణలు రావడం.. మళ్లీ అవే విమర్శలు వినిపిస్తుండటంతో కాంగ్రెస్ కార్నర్ అవుతుందా? అన్న చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌కు ఇంచార్జ్‌లు క‌లిసిరావ‌డం లేదా?
రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చూసే ఇన్‌చార్జులు అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారడం విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో కాంగ్రెస్ ఇన్‌చార్జులుగా పనిచేసిన నేతలు క్విడ్ ప్రో కో మ‌ర‌క‌లు అంటించుకుంటున్నారు. గత ఐదేళ్లలో ఇద్దరు మాజీ ఇన్‌చార్జులపై ఇదే తరహా ఆరోప‌ణ‌లు రావ‌డంతో వారిని ప‌క్కన పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. తాజాగా ప్రస్తుత ఇంచార్జ్‌ దీపాదాస్ మున్షిపైనా సేమ్ టు సేమ్ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. పార్టీ నేతలకు పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇప్పించేందుకు ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి బెంజ్ కార్లు గిఫ్ట్ తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాక‌ర్. తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ ప్రభాకర్ చెబుతుండటం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభాకర్ విమర్శలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నా.. టీపీసీసీ ఇన్‌చార్జులుగా పనిచేస్తున్నవారంతా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కోవడంపైనే పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

గత ఇన్‌చార్జులపైనా ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్చార్జిది అత్యంత కీల‌క‌పాత్ర. అధిష్టానానికి, రాష్ట్ర పార్టీకి అనుసంధాన క‌ర్తగా ఇన్‌చార్జి పనిచేయాల్సివుంటుంది. ఒక్కమాట‌లో చెప్పాలంటే పార్టీ అధిష్టానానికి క‌ళ్లు, చెవులు ఇన్‌చార్జులుగా ఉన్న నేతలే.. అంతటి కీలక బాధ్యతల్లో ఉన్నవారు విమర్శలు, ఆరోపణలకు గురికావడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ఇన్‌చార్జి దీప్‌దాస్ మున్సీపై బీజేపీ ఆరోపణలు చేస్తు.. గతంలో ఇన్‌చార్జిగా పనిచేసిన మాణిక్కం ఠాగూర్‌పై సొంతపార్టీ వారే తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో దుమారం రేపింది. పీసీపీ అధ్యక్ష పదవికి ఠాగూర్‌ బేరం పెట్టారంటూ అప్పట్లో బహిరంగ విమర్శలు చేశారు ప్రస్తుత మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఆరోపణల వల్లే ఠాగూర్‌ను ఇన్‌చార్జిగా తప్పించి ఆయన స్థానంలో మ‌హారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రేకు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. ఠాక్రేపైనా ఇలాంటి ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా విమానంలో వచ్చిన ఠాక్రే.. తిరుగు పయనంలో రోడ్డుమార్గాన వెళ్లేవారు. ఇలా వెళ్లడం వెనుక ఏదో లాజిక్ ఉందని విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల వల్లే అధికారంలోకి వచ్చిన తర్వాత ఠాక్రేను తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం.

Also Read: ఆమెపై అడ్డగోలుగా నోరు పారేసుకుంటే సహించం.. ఎన్వీఎస్ఎస్ క్షమాపణ చెప్పాలి

ఇప్పుడు దీపాదాస్‌పై బీజేపీ ఆరోపణలు చేస్తున్నా, పార్టీలో అంతర్గతంగా ఇదే తరహా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ పోస్ట్ కోసం ఓ నేత దీపాదాస్ మున్షికి గిఫ్ట్ ఇచ్చార‌ని గాంధీభ‌వ‌న్‌లో టాక్. భువ‌న‌గిరి పార్లమెంట్ టికెట్ కోసం మ‌రొకరు, మంత్రి ప‌ద‌వి కోసం ఓ ఎమ్మెల్యే చాలా విలువైన బ‌హుమ‌తులు సమర్పించుకున్నారని ప్రచారం జరుగుతోంది.

Also Read: కాంగ్రెస్ హైకమాండ్‌కు డబ్బు సంచులు మోస్తున్నారు- బాల్క సుమన్ ఆరోపణలు

ఇలా ఇన్‌చార్జులుగా పనిచేసిన ప్రతిఒక్కరూ ఆరోపణలకు కేంద్రంగా మారడం స్థానిక కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పి తెప్పిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ముందు వినిపిస్తున్న విమర్శలకు ఎలా చెక్ చెప్పాలో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేస్తోందని ప్రస్తుతానికి తప్పించుకుంటున్నా.. మున్ముందు ఈ సంస్కృతికి చెక్ చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తోందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు. అయితే తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులపై న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు దీపాదాస్‌ మున్షీ రెడీ అవుతున్నట్టు సమాచారం.