భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజలు : నడిరోడ్డుపై రక్తం కలిసిన అన్నం ముద్దలు, పసుపు-కుంకుమ-నిమ్మకాయలు, మనిషి ఆకారంలో ముగ్గులు

Occult worship in Bhadradri Kottagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది. అశ్వరావుపేట మండలం దిబ్బగూడెం రోడ్డుపై తాంత్రిక పూజలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఐదు రోజులుగా గ్రామ పొలిమేరలో క్షుద్రపూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

రహదారిపై రక్తం కలిసిన అన్నం ముద్దలు, పసుపు కుంకుమ, నిమ్మకాయలు, మనిషి ఆకారంలో ముగ్గులు వేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాదు.. కొబ్బరికాయలు, కోడికళ్లు, కర్రలు, ఎముకలతో బొమ్మలు చేశారు. వీటన్నింటితో తాంత్రిక పూజలు చేసినట్టుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

గ్రామ పొలిమేరలో అర్థరాత్రి జరుగుతున్న తాంత్రిక పూజలు గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. సాయంత్రమైందంటే చాలు.. గ్రామస్తులెవరూ బయటకు రావడం లేదు. ఏదైనా పనిమీద ఇతర చోట్లకు వెళ్లినవారు కూడా.. సాయంత్రంలోగా ఇంటికి చేరుకుంటున్నారు. ఐదురోజులుగా తాంత్రిక పూజలు చేస్తుండడంతో.. గ్రామస్తుల అధికారులకు సమాచారం ఇచ్చారు.

గ్రామస్తుల్లో భయాందోళనలు పోగొట్టడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇవి నిజంగానే తాంత్రిక పూజలా..లేక ఎవరైనా ఆకతాయిల పనా అన్నది తేల్చే పనిలో పడ్డారు. అయితే గ్రామస్తులెవరూ భయాందోళనకు గురికావొద్దని సూచించారు.