తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్ధిని ప్రకటించింది కాంగ్రెస్. తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
శనివారం చింతలపాలెం మండలంలోని నక్కగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మాట్లాడుతూ…నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయం ప్రకారం పద్మావతి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిందని చెప్పారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి పోటి చేసిన ఆమె టీఆర్ఎస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదయ్యపై ఓడిపోయారు.
ఇక హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా పోటి చేసి గెలిచిన ఉత్తమ్…సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నుండి ఎంపీగా పోటి చేసి గెలిచిన విషయం తెలిసిందే. దీనితో అయన హుజూర్ నగర్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయడంతో అ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాలిసిన అవసరం ఏర్పడింది. హుజూర్ నగర్ అసెంబ్లీకి మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు ముందస్తుగానే అభ్యర్థిని ఖరారు చేసేశారు.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం మొత్తం టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం అయిపోయింది. కాబట్టి బలమైన అభ్యర్ధిని బరిలోకి దించి అక్కడి స్థానాన్ని జాడవిడుచుకోవద్దని కాంగ్రెస్ భావించింది. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరిని బరిలోకి దింపే కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యను బరిలోకి దింపాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉత్తమ్ భార్య పద్మావతిని పోటీలో నిలిచింది. మరి ఆ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపనుంది అన్నది ఆసక్తిగా మారింది.