Palapitta Bird : ప్రమాదంలో పాలపిట్టల మనుగడ.. ఈసారి పండుగకు దర్శనం కరువేనా? అసలెందుకిలా జరుగుతుంది..
Palapitta Bird : పాలపిట్ట దర్శనంతో మొదలు పెడితే చాలు తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయని కొన్ని వర్గాలు బలంగా నమ్ముతాయి.. అలాంటి పాలపిట్ట జాతి మనుగడే ఇప్పుడు ప్రమాదంలో పడిందని అంటున్నారు కొంతమంది.
Palapitta Bird
Palapitta Bird : పాలపిట్ట దర్శనంతో మొదలు పెడితే చాలు తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయని కొన్ని వర్గాలు బలంగా నమ్ముతాయి.. అలాంటి పాలపిట్ట జాతి మనుగడే ఇప్పుడు ప్రమాదంలో పడిందని అంటున్నారు కొంతమంది. వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పులతో ఇప్పటికే అంతరించే దశకు చేరిన పాలపిట్టలు తాజాగా దాపరించినటువంటి ఎల్నినో పరిస్థితులతో మరింత ప్రమాదం అంచున చేరాయి. దీంతో ఈ విజయదశమికి శుభశకునం ఇచ్చే పక్షి కనిపించదేమో అనేటువంటి ఆందోళన సర్వత్ర ప్రారంభమైంది.
Also Read : Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే?
వ్యవసాయ పద్ధతుల్లో వచ్చిన మార్పులు వాతావరణంలో వచ్చిన మార్పులతో పాలపిట్ట జాతి ప్రమాదంలో పడింది. దసరా పండగ రోజు పాలపిట్టను చూడటం శుభసూచకంగా పరిగణిస్తాం. తెలంగాణతో పాటు ఒడిస్సా కర్ణాటక కూడా ఈ పాలపిట్టనే రాష్ట్ర పక్షి కావటం విశేషం. అయితే, ప్రకృతిలోని జీవజాతులని కూడా దైవ స్వరూపాలుగా పూజించడం మనకి అలవాటు. కొన్ని వర్గాల ప్రజలు ముందుగా పాలపిట్టను దర్శించుకొని తమ ముఖ్యమైన పనులు ప్రారంభించడం ఓ ఆనవాయితీగా చేస్తారు.
అయితే, ఆధునిక వ్యవసాయంలో రసాయనిక పురుగు మందులు, గడ్డి మందు వాడకం పెరిగిపోవటం వల్ల పాలపిట్టలకు ఆహారమైన కీటకాలు అంతరించిపోతున్నాయి. దీంతో విషపూరిత పురుగులను తినటం వల్ల పాలపిట్టలు అనారోగ్యానికి గురవుతున్నాయి. దీనికితోడు ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో అసలు వానలే కరువైపోయాయి. దీంతో పాలపిట్ట జాతికి ఆహారం దొరకడం కష్టమైపోతుంది. నీరున్న చోటికి ఆహారం దొరికే చోటుకి వలస వెళ్లేంత శక్తి ఈ చిన్ని ప్రాణులకు లేదు కాబట్టి ఎల్ నినో ప్రభావం ఈ పక్షులపై భారీగానే పడుతుందని చెప్పాలి.
పాలపిట్టలు సాధారణంగా చెట్లపై గూడ్లు కట్టుకొని జీవిస్తాయి. పాత, ఎండిపోయిన చెట్లను నరికి వేయటం వల్ల నివాస స్థలాలు సంతానోత్పత్తి ఆవాసాలు కోల్పోతున్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే దసరా సెంటిమెంట్ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ఈ పక్షులను బోనుల్లో బంధించి మరీ జనాలకు చూపెడుతున్నారు. దీంతో స్వేచ్ఛగా ఎగరాల్సిన ఈ బుల్లిపక్షి జాతి జీవులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. అలాకూడా కొంత పాలపిట్ట జాతి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది.
వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం పాలపిట్టల్ని పట్టుకోవడం బంధించడం ప్రదర్శించడం కూడా నేరం. అంతేకాదు, మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా లక్ష వరకు జరిమానా కూడా విధిస్తారు. మరి పాలపిట్టల్ని కాపాడుకోవాలంటే గడ్డి మైదానాలు బీడు భూములు సంరక్షించాలి. అలానే విచక్షణ రహితంగా పురుగు మందులు వాడకూడదు. చెట్లు నరికేయకుండా చూసుకోవాలి. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజల్లో అవగాహన రావటం. ఏదో దసరా రోజున పక్షులను దర్శించుకోవడం ఒక్కటే కాదు.. మిగిలిన రోజుల్లో ఇలాంటి వన్య ప్రాణుల్ని కాపాడుకోవాలనే స్పృహ కలిగి ఉండాలి. అప్పుడే పాలపిట్ట సురక్షితంగా ఉంటూ మనకి శుభాలు పంచుతుంది.
