TSRTC : మ‌హిళా ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఆ కార్డు చూపిస్తున్నారా..? అయితే మీరు ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే

టీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

Pan Card is not valid for free bus scheme in Telangana says TSRTC MD VC Sajjanar

TSRTC MD VC Sajjanar : తెలంగాణ రాష్ట్రంలో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. ఎక్స్ ప్రెస్‌, ప‌ల్లె వెలుగు, సిటీ ఆర్డిన‌రీ, మెట్రో బ‌స్సుల్లో మ‌హిళ‌లు ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే.. ఏదైన ఒరిజిన‌ల్ గుర్తింపు కార్డును చూపించి మ‌హిళ‌లు జీరో టికెట్‌ను పొందాల్సి ఉంటుంది. జిరాక్సులు, ఫోన్ల‌లో గుర్తింపు కార్డులు చూపిస్తే అవి చెల్ల‌వ‌ని ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) స్ప‌ష్టం చేసింది. తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాల‌న్నారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాల‌న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డైన స‌రిపోతుంద‌న్నారు. అయితే.. పాన్‌ కార్డులో అడ్రస్ ఉండ‌క‌పోవ‌డంతో ఉచిత ప్రయాణానికి అంగీక‌రించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఒరిజిన‌ల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖ‌చ్చితంగా డ‌బ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాల‌ని సూచించారు.

Bandi Sanjay: అప్పులు ఉన్నాయని ఎన్నికల ముందు ప్రచారం చేశాం.. అయినప్పటికీ..: బండి సంజయ్

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మ‌హిళ‌ల‌కే వ‌ర్తిస్తుంద‌ని మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన మ‌హిళ‌లు య‌థావిధిగా ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకోవాల‌న్నారు.

జీరో టికెట్‌ తీసుకోవడం ఎందుకు..?

ఉచితంగా ప్ర‌యాణం చేస్తున్నాం గ‌దా.. ఇక జీరో టికెట్ తీసుకోవ‌డం ఎందుకు అని ప‌లువురు సిబ్బందితో వాద‌న‌కు దిగుతున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. ఇది స‌రైన ప‌ద్ద‌తికాద‌న్నారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ న‌గ‌దును ప్ర‌భుత్వం టీఎస్ఆర్టీసీకి ఇస్తుంద‌ని, కాబ‌ట్టి ప్ర‌తి మ‌హిళా ప్ర‌యాణికురాలు త‌ప్ప‌నిస‌రిగా జీరో టికెట్ తీసుకోవాల‌న్నారు. ఒక‌వేళ టికెట్ తీసుకోకుండా ప్ర‌యాణిస్తే అది నేరంగా ప‌రిగణిస్తామ‌ని చెప్పారు. చెకింగ్‌లో ఈ విష‌యాన్ని గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని, అలాగే టికెట్ లేకుండా ప్ర‌యాణించిన వ్య‌క్తికి రూ.500 జ‌రిమానా విధించే అవ‌కాశాలు ఉంటాయ‌న్నారు. ఈ విష‌యాల‌ను గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్‌ తీసుకుని స‌హ‌క‌రించాలి అని సజ్జనార్ తెలిపారు.

సంక్రాంతికి ప్ర‌త్యేక బ‌స్సులు..

సంక్రాంతికి ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌పాల‌ని టీఎస్ఆర్టీసీ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 7 ఆదివారం నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు న‌డుపుతోంది. జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు ఈ ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి. మొత్తం 4,484 ప్ర‌త్యేక బ‌స్సులు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

Bandla Ganesh: కేటీఆర్, హరీశ్ రావుపై బండ్ల గణేశ్ సంచలన కామెంట్స్