Pawan Kalyan : సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన : పవన్ కల్యాణ్

అణగారిన ప్రజలు, కడుపు మండి పోరాడే యువతకు జనసేన, బీజేపీ అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన అని అన్నారు.

Pawan Kalyan at kothagudem : తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన  ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణలో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనది హ్యమనిజమని చెప్పారు. ఆంధ్రాలో గుండాలను, రౌడీలను ఎదుర్కొని నిలబడ్డానంటే దానికి తెలంగాణ ఉద్యమ స్పూర్తే కారణమని పునరుద్ఘాటించారు.

ప్రముఖ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు తనకు ఆదర్శమని.. సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన అని అన్నారు. జనసేన, బీజేపీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సభలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనలేదన్నారు. తాను తెలంగాణలో ఉన్నా లేకపోయినా జనసైనికులు మాత్రం ఇక్కడ ఉంటారన్నారు.

తెలంగాణ కోసం 1200 మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఎనిమిదిమంది జన సైనికులు పోటీ చేస్తున్నారని వారికి మీరు అండగా ఉండాలని.. ఓటు వేసి గెలిపించాలని కోరారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. దాని కోసం దశాబ్దం పాటు ఎదురు చూశానని అన్నారు. అణగారిన ప్రజలు, కడుపు మండి పోరాడే యువతకు జనసేన, బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీపై తనకు అపారమైన నమ్మకముందని, అందుకే ఆయనతో ఉండాలనుకున్నానని వెల్లడించారు.

Also Read: కామారెడ్డిలో కమలనాధుల సభ.. ప్రధాని మోదీ ప్రసంగంపై ఆసక్తి

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రధాని కావాలని ప్రచారం చేశానని గుర్తు చేస్తూ.. తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయనన్నారు. తెలంగాణ పోరాట స్పూర్తి దేశం అంతా ఉంటే అవినీతి పోయేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 65 మంది సీఎంలు వస్తే.. 25 మంది బీసీలేనని అన్నారు. ఈ సందర్భంగా పవన్ గద్దర్ ను గుర్తు చేసుకుంటూ.. ”గద్దరన్న చనిపోయే ముందు ఒకటే కోరాడు అదేమంటే.. తెలంగాణలో యువతకు అండగా ఉండాలని. గద్దరన్న ఆశయం కోసం నిలబడతాను. సీఎం కేసీఆర్, కేటీఆర్ తో నాకు పరిచయాలున్నాయి. అలాగే కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వీహెచ్ తో కూడా పరిచయం ఉంది. కానీ నా మద్దతు మాత్రం బీజేపీ, ప్రధాని మోదీకేన”ని పవన్ మరోసారి స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు