Peddi Sudarshan Reddy : అశ్రునయనాల మధ్య పూర్తయిన పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు.. 12గంటలపాటు సాగిన అంతిమ యాత్ర..

Peddi Sudarshan Reddy : తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పెద్ద సంఖ్యలో అభిమానుల మధ్య అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి.

Peddi Sudarshan Reddys funeral rites concluded at Nallabelli agricultural farm

Peddi Sudarshan Reddy : తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పెద్ద సంఖ్యలో అభిమానుల మధ్య అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. జులై 26న తీవ్ర గుండెపోటుకు గురై సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొదుతూ గురువారం అర్ధరాత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం 8.30గంటలకు హనుమకొండలోని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకురాగా.. అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమ కారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించారు. అనంతరం స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లికి తరలించారు.

Also Read : Telangana High Court: ముమ్మాటికీ తప్పే.. రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయండి.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

వరంగల్ మీదుగా నర్సంపేట రోడ్డు మార్గంలో ఆ నియోజకవర్గం ప్రారంభమయ్యే గిర్నిబావి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర నల్లబెల్లి వరకు 31కిలో మీటర్ల మేర జనసంద్రోహం మధ్య సాగింది. రహదారి మొత్తం కన్నీటి సంద్రంగా మారగా.. పెద్ది అమర్ రహే, జోహార్ పెద్దన్న అంటూ నినాదాలతో మార్మోగిపోయింది. ఉదయం 9.30గంటలకు గిర్నిబావికి చేరుకున్న పెద్ది పార్థివదేహం ఉన్న రథం.. లక్నెపల్లి, మహేశ్వరం, నర్సంపేట, ముత్తోజిపేట, ఇటుకాలపల్లి, రుద్రగూడెం, నారక్కపేట మీదుగా నల్లబెల్లిలోని ఆయన నివాసం వద్దకు అంతిమయాత్ర చేరుకుంది. అక్కడి నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు వేలాదిమంది మధ్య ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, దయాకర్ రావు, పాడి కౌశిక్ రెడ్డిలు పాడె మోశారు. రాత్రి 10గంటలకు వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిరక్వహించారు. కుమారుడు నిదర్శన్ రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు.

ఎటుచూసినా జనసంద్రం..
సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్రకు కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అంతిమయాత్ర ప్రారంభమైన గిర్నిబావిలో ‘మళ్లీ ఎప్పుడు వస్తావు పెద్దన్నా’అంటూ మహిళలు విలపించిన తీరు హృదయాలను కదిలించింది. రహదారుల వెంట నిలబడ్డ ప్రజలే కాదు… వెళ్తున్న బస్సుల్లోని ప్రయాణికులు కూడా కిటికీల్లో నుంచి బయటకు వంగి పెద్ది పార్థివదేహానికి చేతులెత్తి నమస్కరించారు. అంతిమయాత్రలో భావోద్వేగానికి గురైన హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు కంటతడి పెట్టుకున్నారు. ఆయన సతీమణి పెద్ది స్వప్న, కుటుంబ సభ్యుల రోధనలు చూసి అభిమానులు, కార్యకర్తలు బోరున విలపించారు. కేటీఆర్, హరీశ్‌రావు భారాస నేతలతో కలిసి పార్టీ జెండాను సుదర్శన్‌రెడ్డి భౌతికకాయంపై కప్పారు.