Pedestrian Accident: ఇది చాలా ప్రమాదకరం.. తొందరపడొద్దు.. వీడియో షేర్ చేసిన సజ్జనార్

ఇటీవల కాలంలో పాదచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

pedestrian accident causes video shared by vc sajjanar

Pedestrian Accident – VC Sajjanar:  రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంగా ఎక్కువయ్యాయి. రోడ్డు దాటుతూ ప్రతిరోజు ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అజాగ్రత్త, అవగాహన లేకపోవడం వంటి కారణాలతో పాదచారులు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే నగర రహదారులపై పాదచారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. హైదరాబాద్ (Hyderabad) లో ఇటువంటి యాక్సిడెంట్లు అధికమయ్యాయి.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, నిర్లక్ష వైఖరి కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వివిధ మాధ్యమాల ద్వారా వాహనదారులు, పాదచారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. పాదచారులకు జరుగుతున్న ప్రమాదాలపై తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విటర్ లో స్పందించారు. హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల జరిగిన రోడ్డు ప్ర‌మాదాలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

అజాగ్ర‌త్త కారణంగా పాద‌చారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తొంద‌ర‌గా వెళ్లాల‌నే ఆత్రంలో అటుఇటు చూసుకోకుండా రోడ్డు దాటుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. పరధ్యానంతో ప్రమాదాలకు తావిస్తూ.. త‌మ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు దాటే సమయంలో పాదాచారులు తగు జాగ్రత్తలు పాటించాలని సజ్జనార్ సూచించారు. సెల్‌ఫోన్‌, ఇయర్‌ ఫోన్స్‌ వాడుతూ రోడ్డు దాటడం ప్రమాదకరమని హితవు పలికారు.

Also Read: ఉప్పల్ స్కై వాక్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ప్రత్యేకతలు ఇవే..

కాగా, సజ్జనార్ వీడియోపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవులోంది. సిగ్నల్స్, రోడ్డు డివైడర్లు కరెక్ట్ గా లేవని కొందు ఫిర్యాదు చేశారు. జిబ్రా కాస్సింగ్ గుర్తులు ఉన్నచోట వాహనాలు నెమ్మదిగా వెళ్లేలా చూడాలని కోరారు. హైద‌రాబాద్‌లో పెలికాన్ సిగ్నల్స్ పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. రద్దీ రోడ్లపై వాహనాల మితిమీరిన వేగాన్ని నియంత్రిచాలన్నారు.