సరిలేరు మీకెవ్వరూ : ఇళ్లల్లో ప్రజలు..కుటుంబాలకు దూరంగా పోలీసులు

  • Publish Date - April 10, 2020 / 03:32 AM IST

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం అల్లాడిపోతున్నాయి. భారత్‌ లాక్‌డౌన్‌ విధించింది కాబట్టి కరోనాను కట్టడి చేయగలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతోంది. ఇందులో పోలీసుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. పోలీసులు అహర్నిశలు డ్యూటీ చేస్తున్నారు కాబట్టే.. లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతోంది.

కరోనాతో విధుల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తోన్న ఖాకీలకు ప్రజల నుంచే కాదు.. ఎండ నుంచి కష్టాలు తప్పడం లేదు. అసలే ఎండాకాలం. సూర్యుడు తన ప్రతాపం చూపడంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను మించిపోతున్నాయి. రోజురోజుకు ఎండలు మండిపోతున్నారు. దీంతో ఎండలతోనూ పోలీసులు సహవాసం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు పొడిగించే సంకేతాలు కనిపిస్తున్నాయి.

దీంతో పోలీసుల ఈ తిప్పలు మరొకొన్ని రోజులు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో ఎవరికీ వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాకపుట్టిస్తున్నఎండ నుంచి రక్షణ పొందేందుకు మజ్జిగను ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. జ్యూస్‌తో ఉపశమనం పొందుతున్నారు. ఏదేమైనా ప్రజలంతా హాయిగా ఇళ్లల్లో తమ కుటుంబాలతో గడుపుతుంటే.. పోలీసులు తమ కుటుంబాలకు దూరమయ్యారు. 

 పోలీసులు రేయింబవళ్లు డ్యూటీ చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి… ప్రతి వాహనాన్ని ఆపి క్లారిటీ తీసుకుంటున్నారు. సరైన కారణం లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఒక హైదరాబాద్ నగరంలోనే దాదాపు లక్షా 90వేల వాహనాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేలల్లో వాహనాలను సీజ్‌ చేశారు. అకారణంగా బయటకు వస్తే చలాన్లు కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు లేని దగ్గర సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. దీంతో రోడ్లపై  ప్రధానంగా యువత చక్కర్లు కొట్టడం తగ్గిపోయింది. అత్యవసరం అయితేనే రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది.(ఎప్పుడైనా చూశారా : ఎండకాలంలో తిరుమలలో మంచు దుప్పటి)

పోలీసులు కొన్ని రోజులుగా డోన్లతోనూ నిఘా పెట్టారు. ప్రధానంగా కంటైన్మెంట్, రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో  డ్రోన్లతో అక్కడి పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు. ఎవరు ఎప్పుడు రోడ్కెక్కుతున్నారో తెలుసుకుని వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటి నుంచి వారిని కదలకుండా డ్రోన్లతో నిఘా ఉంచారు. ఎవరు బయటకు వచ్చినా ఇట్టే పోలీసులు పసిగట్టి చర్యలు తీసుకుంటున్నారు. హాట్‌స్పాట్‌, రెడ్‌జోన్‌ ప్రాంతాలేకాదు.. జనాలు భారీగా రోడ్లపైకి వస్తున్న ప్రాంతాల్లోనూ డ్రోన్లతో నిఘా ఉంచారు. దీంతో చాలా వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం మానేశారు. ఇక ప్రజల శ్రేయస్సు కోసం కోసం  ప్రాణాలను పణంగా పెట్టి డ్యూటీ చేస్తున్నపోలీసులకు హ్యాట్సాప్‌.