Ibomma Ravi: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో నాలుగో రోజు కస్టడీ ముగిసింది. రవికి చెందిన బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలతో పలు బ్యాంకులకు మెయిల్స్ చేశారు సీసీఎస్ పోలీసులు. బ్యాంకులు అందించే వివరాలతో మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. సినిమాలను పైరసీ చేసేందుకు తనకు ఎవరూ సహకరించలేదని, ఒక్కడినే అంతా చేశానని రవి చెబుతున్నాడు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే పైరసీ సినిమాలను అప్ లోడ్ చేసినట్లు రవి చెబుతున్నాడు. తాను వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్ సైట్ క్రియేట్ చేసి పైరసీ కంటెంట్ అప్ లోడ్ చేసే వాడినని రవి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే రవి నెదర్లాండ్స్ కి వెళ్లాడు.
అరెస్ట్ ను ముందే పసిగట్టిన రవి.. తన దగ్గరున్న హార్డ్ డిస్క్ ల్లో సినిమాలు తప్ప మిగతా డేటా అంతా ఎరేజ్ చేశాడు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును పలు అకౌంట్లకు మళ్లించాడు. దొరికిన టైమ్ ను సద్వినియోగం చేసుకుని తన సర్వర్ వివరాలు, వెబ్ సైట్ల వివరాలన్నీ ఎవరికీ దొరకకుండా రవి మాయం చేశాడు. విచారణలో పోలీసులు కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడు. పైరసీ నెట్ వర్క్ గురించి నోరే విప్పడం లేదు. కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయటపెట్టాడు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. ప్రతి 15, 20 రోజులకు ఒక్కో దేశం చొప్పున తిరిగాడు.
నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్ ల్యాండ్, దుబాయ్ దేశాలకు టూర్ లు వేశాడు. సెయింట్ కిట్స్ నేవీస్ పౌరసత్వం తీసుకున్నాడు రవి. విదేశాల్లో ఉన్న సోఫిస్టికేటెడ్ సర్వర్ల ద్వారా పైరసీ నెట్ వర్క్ ను నడిపాడు. రవికి చెందిన ఒక బ్యాంక్ అకౌంట్ లో 3.5 కోట్ల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, వైజాగ్ లో రవికి ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి. బిజినెస్ క్లాస్ ట్రావెల్ ఫ్లైట్స్ లో తిరుగుతూ, లగ్జరీ హోటల్స్ లో గడిపాడు. ఒంటరిగానే ఉంటే లావిష్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు రవి.
కానీ, పైరసీ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారనేది మాత్రం చెప్పడం లేదు. నాలుగు రోజుల కస్టడీలో రవి పోలీసులకు ఎలాంటి విషయాలు చెప్పలేదు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా తెలీదు, మర్చిపోయా అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక రేపటితో రవి 5 రోజుల కస్టడీ ముగియనుంది. రేపు కూడా విచారణలో రవి ఎలాంటి విషయాలు చెప్పకపోతే పోలీసులు అతడిని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది.