బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియను విచారించిన పోలీసులు..పరారీలో ఆమె భర్త భార్గవ్ రామ్

Boinpally kidnapping case : హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. బేగంపేట్ మహిళా పీఎస్ లో అఖిలప్రియను పోలీసులు విచారించారు.గాంధీ ఆస్పత్రిలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

కాసేపట్లో సికింద్రాబాద్ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కిడ్నాప్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న చంద్రహాస్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నాడు. దీంతో అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను అరెస్టు చేశారు. భూమికి సంబంధించిన వ్యవహారంలో జరిగిన కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ మంత్రి అఖిల ప్రియ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బుధవారం (జనవరి 6, 2021) ఆమెను అదుపులోకి తీసుకుని బోయిన్ పల్లి పీఎస్ కు తరలించారు.

ఈ కేసులో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అఖిల ప్రియ, ఆమె భర్తపై పోలీసులకు ప్రవీణ్ రావు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేసినట్లు సమాచారం.