Huzurabad Political : వేడెక్కిన హుజూరాబాద్ పాలిటిక్స్

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ? కొద్ది రోజుల్లో ఇక్కడ ఉప ఎన్నిక జరుగనుంది. ఎమ్మెల్యే, మంత్రి పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే..ఈ నియోజకవర్గంపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలని, మిత్రపక్షాలకు షాక్ ఇవ్వాలని ఇప్పటి నుంచే గులాబీ దళం వ్యూహాలు రచిస్తోంది. దీంతో పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి.

Huzurabad Political : వేడెక్కిన హుజూరాబాద్ పాలిటిక్స్

Huzurabad

Updated On : June 18, 2021 / 9:41 AM IST

Huzurabad Political : హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల్లో ఇక్కడ ఉప ఎన్నిక జరుగనుంది. ఎమ్మెల్యే, మంత్రి పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే..ఈ నియోజకవర్గంపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలని, మిత్రపక్షాలకు షాక్ ఇవ్వాలని ఇప్పటి నుంచే గులాబీ దళం వ్యూహాలు రచిస్తోంది. దీంతో పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. అభివృద్ధిని మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందిస్తూనే…పార్టీకి ఈటెల ద్రోహం చేశారంటూ…ప్రజలకు వివరిస్తున్నారు. హుజూరాబాద్ లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ మకాం వేసి పరిస్థితులను గమనిస్తున్నారు.

మరోవైపు…ఈటల స్వరం పెంచుతున్నారు. వచ్చే ఉప ఎన్నిక కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. సతీసమేతంగా హుజురాబాద్‌లో పర్యటిస్తున్నారు ఈటల. బీజేపీలో చేరాక తొలిసారి ఈటల నియోజకవర్గం వెళ్లారు. నాలుగు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. తన అనుచరులు, ప్రజలతో మమేకం కానున్నారు.

కేసీఆర్‌ తనకు అన్యాయం చేశారని ప్రజలు చెబుతున్నారని.. చైతన్యవంతమైన హుజురాబాద్‌ గడ్డ కేసీఆర్‌కు బుద్ధి చెబుతుందన్నారు ఈటల. మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా నియోజకవర్గంలో తిష్టవేసినా ప్రజలు వారిని నమ్మరన్నారు. ప్రభుత్వ అహంకారానికి ఘోరీ కడతారన్నారు. ప్రగతి భవన్‌లో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే మంత్రులు ఇంటికివెళ్లి బాధ పడ్తారన్నారు. తనకు మద్దతిస్తున్నవారిని ఇంటెలిజెన్స్‌ వేధిస్తోందని ఆరోపించారు ఈటల.

అటు ఈటల సతీమణి జమున బత్తినవారి పల్లి, గోపాల్‌పూర్‌, గుంటూరు పల్లి, లక్ష్మీపూర్‌లో ఇంటింటికి తిరిగి ప్రజలను కలవనున్నారు. ఉప ఎన్నికలో తన భర్త గెలుపు ఖాయమన్నారు జమున. గత ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించకుంటామని ప్రజలు చెబుతున్నారన్నారు. ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా, ప్రలోభాలకు గురిచేసినా ఈటల రాజేందర్‌కే ఓట్లు పోలవుతాయన్నారు జమున. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన రాజకీయాల్లో కాంగ్రెస్ సైతం పోరుకు సై అంటోంది. త్వరలోనే హుజురాబాద్ లో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు పర్యటించనున్నారు.