Ponnam Prabhakar(Photo : Google)
Ponnam Prabhakar – Komatireddy Venkat Reddy : హైదరాబాద్ గాంధీభవన్ దగ్గర గందరగోళం నెలకొంది. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరులు గాంధీభవన్ ముందు నిరసనకు దిగారు. పార్టీలో ఏ ఒక్క కమిటీలోనూ సముచిత స్థానం కల్పించకుండా పొన్నం ప్రభాకర్ ను అవమానపరుస్తున్నారని ఆందోళనకు దిగారు. పార్టీలో ఎన్ఎస్ యుఐ నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన పొన్నంకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పొన్నంపై కొందరు జిల్లా నేతలు, పార్టీలో సీనియర్ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ అనుచరులు ఆరోపించారు. పీఏసీ మీటింగ్ కోసం గాంధీభవన్ వస్తున్న సీనియర్ నేతలను పొన్నం ప్రభాకర్ అనుచరులు అడ్డుకుంటున్నారు. పొన్నంకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పొన్నం ప్రభాకర్ అనుచరుల ఆందోళనపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిటీలో అవసరమైతే నా పేరు పక్కన పెట్టి పొన్నం ప్రభాకర్ పేరు పెట్టాలని కోరతాను అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
”పీఏసీ ఏర్పడిన తర్వాత మొదటి మీటింగ్ కు వస్తున్నా. ఎన్నికల స్ట్రాటజీపై కీలక నిర్ణయాలు ఉంటాయి. బస్సు యాత్రపై ఈ కమిటీలో నిర్ణయం ఉండే అవకాశం ఉంది. టీఆర్టీ అభ్యర్థులకు మద్దతుగా రెండు రోజుల దీక్ష చేస్తా. అధికార పార్టీ నేతలు దలితబంధులో 30శాతం, బీసీ బంధులో 40శాతం కమిషన్ తీసుకుంటున్నారు. కేసీఆర్ అవినీతిపై పోరాటం ఉధృతం చేస్తాం” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.