Telangana Politics: బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్‌.. తెరవెనుక రాజకీయంలో మూడూ మూడే!

వరికి వారే ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని రసకందాయంగా మార్చేస్తున్నారు. మూడోసారి గెలవాలని బీఆర్‌ఎస్.. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ.. కాంగ్రెస్‌తోనే భవిష్యత్ అంటూ హస్తం నేతలు విసురుతున్న పాచికలు.. రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి.

Telangana Politics: బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్‌.. తెరవెనుక రాజకీయంలో మూడూ మూడే!

Kishanreddy, KCR, Revanth Reddy

Telangana Politics Mind Game: తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలతో ఆధిపత్యం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలు మూడూ ఒకే రీతిలో అడుగులు వేస్తున్నాయి. మైండ్‌గేమ్‌నే ఆయుధంగా చేసుకుని రాజకీయ వలసలపై లీకులిస్తున్నాయి. ఈ వలస రాజకీయం ప్రతిపార్టీలో కనిపిస్తుండటంతో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో.. ఎటు వైపు జంప్ చేసేస్తోరో తెలియడంలేదు.. తెరవెనుక రాజకీయంలో ప్రధాన పార్టీల స్కెచ్ ఏంటి?

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఇందుకోసం సన్నాహాలు మొదలుపెట్టడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహా ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. రకరకాల అస్త్రాలతో
ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టే మాస్టర్ మైండ్‌లు.. మైండ్ గేమ్‌లకు తెరతీస్తున్నాయి. ఇందులో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యే.. ఎంపీ స్థాయి
నేతలతో కిక్కిరిసిపోయిన బీఆర్‌ఎస్ (BRS Party) కూడా వలస రాజకీయాలను ప్రోత్సహిస్తుండటం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్ మొదట్లో కాంగ్రెస్, తెలుగుదేశం (Telugu Desam Party), బీజేపీ నేతలను చేర్చుకుంది. ఇలా ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు తయారుకావడంతో ఈ ఎన్నికల్లో కొత్తగా ఎవరినీ చేర్చుకోవద్దని తొలుత భావించింది. ఐతే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్‌ఎస్ నేతలకు గాలం వేస్తుండటంతో ప్రతివ్యూహాలు రచిస్తోంది బీఆర్‌ఎస్. ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే స్థాయి నాయకులపై ఆకర్ష్ వల విసురుతుండటంతో.. ఆ పార్టీలను క్షేత్ర స్థాయిలో దెబ్బతీసేందుకు ఆయా పార్టీల కార్యకర్తలు, ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులను టార్గెట్ చేస్తోంది బీఆర్‌ఎస్.

Also Read: బీఆర్‌ఎస్‌తో బంధాన్ని కొనసాగించాలా, వద్దా.. తెలంగాణలో వామపక్షాల తర్జనభర్జన

బీఆర్ఎస్‌ను పడగొట్టడమే లక్ష్యంగా డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో ఈ వలసలకు ముందుగా తెరతీసింది బీజేపీ. గ్రేటర్ ఎన్నికల నుంచి వలస రాజకీయాన్ని నమ్ముకున్న బీజేపీ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ముఖ్య నాయకులను టార్గెట్ చేసి.. కమలం గూటికి తీసుకువెళ్లింది. దీనివల్ల బీజేపీకి మంచి మైలేజ్ వచ్చింది. ఒకానొక సమయంలో అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో చాలా మంది నేతలు బీజేపీ వైపు చూశారు. ఫలితంగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, మాజీ మంత్రి చంద్రశేఖర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వంటి సీనియర్లు బీజేపీ గూటికి చేరారు. ఇలా మంచి ఊపుమీద కనిపిస్తున్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల తర్వాత ఝలక్ తగిలింది. ఈ పరిస్థితుల నుంచి మళ్లీ తేరుకున్న బీజేపీ.. మళ్లీ చేరికలపై ఫోకస్ పెట్టింది. బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం పూర్తి కావడంతో ఇక పార్టీ విస్తరణే లక్ష్యంగా అడుగులు వేయనుందని పరిశీలకులు చెబుతున్నారు.

Also Read: సంజయ్‌కి అస్సలు మింగుడు పడటం లేదట.. గెలిచే చాన్స్ లేదని చెప్పకనే చెప్పేశారా?

మరోవైపు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్.. బీఆర్‌ఎస్, బీజేపీ ఆకర్ష్ ఆపరేషన్లతో కుదేలైంది. అయితే అనూహ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి ఔట్ గోయింగే గాని.. ఇన్‌కమింగ్ ఉండేది కాదు.. కానీ ఈ మధ్య ఔట్ గోయింగ్‌కి పూర్తిగా ఆగిపోయింది. ఇన్‌కమింగ్ కాల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడంతోపాటు.. పార్టీలో చేరతామని మిస్‌డ్ కాల్స్ చేస్తున్నవారూ ఎక్కువయ్యారు. ఇదేసమయంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు చేరుతున్నారంటూ ప్రకటనలు చేస్తోంది కాంగ్రెస్. ఇందుకు అనుగుణంగా ఖమ్మం నుంచి సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా 33 మంది నేతలను పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత గద్వాల్ జడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య (Saritha Tirupataiah) అండ్ టీమ్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఈ నెల 30న కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదే ఊపులో మరికొంతమంది కాంగ్రెస్ గూటికి వస్తారంటూ కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వేముల వీరేశం, తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) తో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: కాకరేపిన ‘కరెంట్’ కామెంట్లు.. రేవంత్‌రెడ్డిపై రగులుతున్న సీనియర్లు

ఇలా మూడు పార్టీలూ ఎవరికి వారే ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని రసకందాయంగా మార్చేస్తున్నారు. మూడోసారి గెలవాలని బీఆర్‌ఎస్.. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ.. కాంగ్రెస్‌తోనే భవిష్యత్ అంటూ హస్తం నేతలు విసురుతున్న పాచికలు.. రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి. ఎవరు ఎప్పుడు.. ఏ పార్టీకి హ్యాండిస్తారో.. ఎటు నుంచి ఎటు జంప్ చేస్తారో.. ఎవరి మదిలో ఏముందో అంతుబట్టని విధంగా తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారిపోయింది.