Swetcha Votarkar Case: జర్నలిస్ట్ స్వేచ్ఛ కేసు.. పూర్ణచందర్ కు రిమాండ్.. చంచల్ గూడ జైలుకి తరలింపు..

తమ కూతురి మరణానికి ఆమెతో సహజీవనం చేస్తున్న పూర్ణచందర్ కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Swetcha Votarkar Case: తెలుగు న్యూస్ చానల్ యాంకర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్మరణం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పూర్ణచందర్ కి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పోలీసులు పూర్ణచందర్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు.

యాంకర్ స్వేచ్ఛ కేసులో నిందితుడు పూర్ణచందర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పూర్ణచందర్ పై పోక్సో కేసు నమోదైంది. నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో బీఎన్ఎస్ యాక్ట్ 69, 108 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. స్వేచ్ఛ కూతురి స్టేట్ మెంట్ ఆధారంగా పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో కూడా తనతో పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు స్టేట్ మెంట్ ఇచ్చింది.

యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. జూన్ 27 రాత్రి జవహర్ నగర్‎లోని తన నివాసంలో ఆమె ఉరి వేసుకుంది. తమ కూతురి మరణానికి ఆమెతో సహజీవనం చేస్తున్న పూర్ణచందర్ కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు పూర్ణచందర్ కేసు నమోదు చేశారు. యాంకర్ స్వేచ్ఛ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

Also Read: మెదక్‌లో తీవ్ర విషాదం.. కోర్టు భవనం పైనుంచి దూకేసిన కుటుంబం.. భార్య మృతి.. భర్త పిల్లల పరిస్థితి విషమం..

ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన ఆరోపణలను పూర్ణచందర్ ఖండించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. స్వేచ్ఛ మృతికి తాను కారణం కాదన్నారు. స్వేచ్ఛ చనిపోవాలని తాను ఎప్పుడూ కోరుకోలేదన్నారు. ఆమెపై తాను ఎప్పుడూ కూడా ఒత్తిడి తీసుకురాలేదన్నారు. పెళ్లి పేరుతో మోసం చేశానన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. రెండు సార్లు విడాకులు తీసుకోవడంతో ఆమె చాలా డిప్రెషన్ లో ఉందని చెప్పారు. జీవితంలో ఆమె కోల్పోయిన ఆనందాన్ని తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశానని వివరించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆమెను తమ సూటిపోటి మాటలతో బాధ పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాకు లేఖ విడుదల చేశారు.