ఆ ప్రాంత కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీమంత్రి అన్నట్లుగా సీన్

పాత కాంగ్రెస్ నేతలకు, కొత్త క్యాడర్‌కు గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరుకు పెట్టింది పేరు. ఇది కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సొంత నియోజకవర్గం. 2009 వరకు ఈ సెగ్మెంట్‌ జనరల్ క్యాటగిరి కింద ఉండటంతో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడ నుంచి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2009 తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంగా మారడంతో..ఆయన సూర్యాపేటకు షిఫ్ట్ అయ్యారు. అయినా తన సొంత సెగ్మెంట్ తుంగుతుర్తి పాలిటిక్స్‌ తన కనుసన్నుల్లోనే జరిగేలా చూసుకుంటారు దామోదర్ రెడ్డి.

ఇప్పటికీ తుంగతుర్తిలో దామోదర్ రెడ్డికి బలమైన అనుచరవర్గం ఉంది. అందుకే అక్కడ ఎవరు పోటీ చేయాలన్నా.. దామోదర్ రెడ్డి మద్దతు ఉండాల్సిందే. అయితే గతంలో తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న అద్దంకి దయాకర్, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మందుల సామేల్..దామోదర్ రెడ్డి వర్గాన్ని పక్కనపెట్టి పనిచేయాలని ప్రయత్నిస్తుండటంతో గ్రూప్‌ వార్‌ రచ్చకెక్కుతోంది. దీంతో నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా.. ఆధిపత్యపోరు..పరస్పరం దాడులతో ఇష్యూ అవుతోంది.

Also Read: ఫాస్టాగ్ వాడేవారికి హెచ్చరిక.. ఇకపై ఇలా చేస్తే బ్లాక్‌లిస్ట్.. NHAI కొత్త నిబంధనలు

రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవం కోసం సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశాయి పార్టీ శ్రేణులు. అయితే సీఎంకు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం పెట్టిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు.

గతంలోనూ పలు కాంట్రవర్సీల్లో మందుల సామేల్ పేరు
ఎమ్మెల్యే తనయుడే ఫ్లెక్సీలను చింపేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక గతంలోనూ పలు కాంట్రవర్సీల్లో మందుల సామేల్ పేరు ప్రచారం జరిగింది. కమిషన్ ఇవ్వాలంటూ లిక్కర్ వ్యాపారులతో ఆయన మాట్లాడినట్లు బయటికొచ్చిన వీడియోతో విమర్శలు ఎదుర్కొన్నారు ఎమ్మెల్యే. ఇక సొంత పార్టీ నేతలతో వైరం ఉండే ఉంది. ఈ అంశాలన్నీ సీఎం దృష్టికి వెళ్లడంతోనే..తిరుమలగిరి సభా వేదికగానే..పద్ధతి మార్చుకోవాలని డైరెక్ట్‌గా స్థానిక ఎమ్మెల్యేకు చురకలు అంటించారు రేవంత్‌.

అసంతృప్తిగా ఉన్నవాళ్లను కూడా కలుపుకొని పోవాలని వేదిక మీదే చెప్పారు సీఎం రేవంత్. అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు అంతా ఒక్కటై గెలిపించారు..ఇప్పుడు వాళ్లను నువ్వు గెలిపించాలంటూ..తుంగతుర్తి ఎమ్మెల్యేపై చేయి వేసి మరీ మాట్లాడారు ముఖ్యమంత్రి. రేవంత్‌ మాటలను బట్టి చూస్తే..వ్యవహార శైలి మార్చుకోవాలని ఎమ్మెల్యేకి చెప్పినట్టేనన్న చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే సామెల్ అందర్నీ కలుపుకొని పోవడం లేదని..పాతవారిని పక్కనపెట్టి కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారని లోకల్ లీడర్లు ఆరోపిస్తున్నారు.

పాత కాంగ్రెస్ నేతలకు, కొత్త క్యాడర్‌కు గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిని ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు సీఎంకు నివేదిస్తూనే ఉన్నాయట. దీంతో ఆయన కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టారని.. అందులో భాగంగానే సభాముఖంగా అందరికీ విషయం అర్థం అయ్యేట్టు చెప్పారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఆధిపత్య పోరు సమసిపోతుందా లేక ఎవరికీ వారే అన్నట్లు నడుచుకుంటారా అనేది వేచి చూడాలి.