Priyanka Gandhi: బీఆర్ఎస్ దోచుకుంది.. మేము ఈ ఆరు హామీలను అమలుచేసి తీరతాం: ప్రియాంకా గాంధీ

వేల కోట్ల రూపాయల భూములను బీఆర్ఎస్ దోచుకుందని ప్రియాంకా గాంధీ అన్నారు.

Priyanka Powerful Speech at Mulugu Public Meeting

Assembly Elections 2023: రంగారెడ్డి జిల్లాలోని వేల కోట్ల రూపాయల భూములను బీఆర్ఎస్ దోచుకుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ఇవాళ కాంగ్రెస్ ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ… బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని చెప్పారు. బీఆర్ఎస్ రిమోట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో ఉందని ఆరోపించారు. రాష్ట్రాన్ని వైన్, ఇసుక మాఫియాలు దోచుకుంటున్నాయని అన్నారు.

బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఆనందంగా లేరని అన్నారు. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని చెప్పారు. ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చామని, రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని, తాము ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చుతామని చెప్పారు. అలాగే, 18 ఏళ్లు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇస్తామని తెలిపారు.

ఆరు గ్యారంటీల ప్రస్తావన

కాంగ్రెస్ గ్యారంటీ కార్డులోని అంశాలను ప్రియాంకా గాంధీ మరోసారి ప్రస్తావించారు. అభయ హస్తం కింద మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామన్నారు. అలాగే, రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామన్నారు.

రైతు భరోసా పథకం కింద తాము ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15,000 ఇస్తామని, రూ.12,000 వ్యవసాయ కూలీలకు ఇస్తామని చెప్పారు. అలాగే. వరి పంటకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామన్నారు.

గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు.

యువ వికాసం పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని అన్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని తెలిపారు. చేయూత గ్యారంటీ కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్ అందిస్తామని వివరించారు. పేదలకు 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామని తెలిపారు.