Public Command Control And Data Center : అత్యాధునిక సాంకేతికతో నేరస్తుల ఆటకట్టించడానికి హైదరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పబ్లిక్ కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
దీంతో హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 5 వేల కెమెరాలను ఒకేసారి చూసేలా పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్, డేటా సెంటర్‌ను అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని అన్ని సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేసి ఇక్కడి నుంచి పర్యవేక్షించనున్నారు.
బంజారాహిల్స్‌లో నిర్మాణంలో పోలీస్ టవర్లలో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాంతరంగా దీనిని ఏర్పాటు చేశారు. త్వరలోనే దీనిని డయల్ 100కు అనుసంధానం చేయనున్నారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో ఈ సెంటర్‌ను నిర్మించారు.
ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏకకాలంలో భారీ తెరపై ఐదువేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉంది. 10లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెల రోజుల పాటు నిక్షిప్తం చేసేలా భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 14 మీటర్ల పొడవు, 42 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ తెర, దాని పక్కనే రెండు వైపులా 55 అంగుళాల సామర్థ్యం గల మరో నాలుగు టీవీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడ నుంచి వీక్షించవచ్చు.