Raghunandan Rao: పిల్లలు స్కూల్ కు వెళ్లిన తర్వాత సెలవు ప్రకటిస్తారా.. ధన్యవాదాలు అంటూ సెటైర్లు

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విటర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

raghunandan rao sataires on telangana holiday for schools

Raghunandan Rao Schools Holiday: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అత్యంత భారీస్థాయిలో వర్షాలు పడుతున్నాయి. దీంతో తెలంగాణలో విద్యాసంస్థలకు ( Telangana Schools) నేడు, రేపు సెలవు (Holiday) ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆలస్యంగా ప్రకటన చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్ష నాయకులు మండిపడుతున్నారు. తమ పిల్లలను స్కూల్స్, కాలేజీలకు పంపించిన తర్వాత ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు (Parents) అయోమయంలో పడిపోయారు.

సూల్స్ వెళ్లిన విద్యార్థులను యాజమాన్యాలు తిరిగి పంపిస్తుండడంతో పేరెంట్స్ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముందుగానే సెలవు ప్రకటించివుంటే ఈ బాధలు ఉండేవి కావన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా తరగతులు కొనసాగించాలా, విద్యార్థులను ఇంటికి పంపించివేయాలా అనే సందిగ్దంలో పడిపోయాయి. ప్రభుత్వం ముందుగానే సెలవు ఇచ్చివుంటే స్కూల్స్ తెరిచేవాళ్లం కాదని అంటున్నాయి.

కాగా, ప్రభుత్వం ఆలస్యంగా సెలవు ప్రకటించడంపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ట్విటర్ లో వ్యంగ్యంగా స్పందించారు. “గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను చూస్తూ ఉదయం 9 గంటలకు స్పందించి సెలవులు ప్రకటించాలని ఈరోజు ఫాంహౌజ్ నుండి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలు స్కూల్ కు వెళ్లిన తర్వాత నిద్ర లేచి విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అంటూ రెండు ట్వీట్లు చేశారు. అటు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ తీరుపై నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.

మరో 4 గంటలు భారీ వర్షాలు.. జీహెచ్‌ఎంసీలో అలర్ట్
హైదరాబాద్‌లో మరో 4 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్ టీంలు సిద్ధంగా ఉండాలని
ఆదేశించారు. ఇక ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న భారీవర్షంతో హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. రహదారులపై పలు చోట్ల భారీగా నీరు నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరవాసులు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.