కేసీఆర్ జైలుకే అన్నారు.. మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: సీఎం రేవంత్‌పై రఘునందన్ ఫైర్

కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. మరి కేసీఆర్ ను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనా..?

Raghunandan Rao Madhavaneni : తనను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. దుబ్బాక అభివృద్ధిని చూసేందుకు వస్తే తాను చూపిస్తానన్నారు. సాయంత్రం వరకు దుబ్బాకలోనే ఉంటానని, రేవంత్ వచ్చేందుకు అవసరమైతే బస్సులు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు.

దుబ్బాకలో అక్కడి ప్రజలను, రైతులను వంచిస్తే అక్కడి ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు.. మళ్లీ రంగు మార్చి మెదక్ పార్లమెంట్ లో ఓటు వేయమని అడుగుతున్నారు. రఘునందన్ రావుకి ఓటు వేసి ఎంపీ అయితే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతారా? అని నేను అడుతున్నా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి రఘునందన్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

”దుబ్బాకలో ఓడిన రఘునందన్ మెదక్ లో ఎలా గెలుస్తాడంటే.. కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. కొడంగల్ లో గెలవలేదా? కొడంగల్ లో ఓడిన రేవంత్ రెడ్డి.. మల్కాజ్ గిరిలో గెలవలేదా? అందుకే.. ఒక ఎన్నికను మరో ఎన్నికతో పోల్చవద్దు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా.. వ్యక్తిగత దూషణలకు వెళ్లొద్దు. సమంజసం కాదు. మీరు అందరి మీద దాడి చేసినట్లు రఘునందన్ మీద దాడి చేస్తానంటే.. అస్సలు జరగదు” అని రఘునందన్ రావు హెచ్చరించారు.

”దుబ్బాకలో నిన్ను గెలిపిస్తే నరేంద్ర మోదీతో కొట్లాడి వేల కోట్లు తీసుకొచ్చి దుబ్బాకు అభివృద్ధి చేస్తాను అన్నావ్ కదా.. మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకుని వస్తాం. నువ్వు తెచ్చిన నిధులు ఏందో? నరేంద్ర మోదీ ఇచ్చిన పరిశ్రమలు ఏందో? దుబ్బాకలో నాకు చూపించమని అడుగుతున్నా” అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. దీనికి రఘునందన్ అంతే ఘాటుగా బదులిచ్చారు.

”నాది గడీ కాదు. ఇల్లు. సాయంత్రం వరకు నేను దుబ్బాకలో ఎదురుచూస్తా. మీరు రండి. బస్సులను పెట్టమంటే నేనే పెడతా. నేను ఫ్రీగా ఇచ్చిన బస్సులోనే ఇద్దరం కలిసిపోదాం. లేదా మీకు నచ్చిన వారందరిని తోలుకొని రండి. రఘునందన్ గడీలో ఉంటాడా? లేదా? ఒకసారి చూశాక మాట్లాడండి” అని సీఎం రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు రఘునందన్.

తనను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన మరికొన్ని విమర్శలకు సైతం కౌంటర్ ఇచ్చారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిచ్చిన వారు అన్ని తప్పులే రాసిచ్చారని ఆయన విమర్శించారు. కామారెడ్డిలో ఓడిన రేవంత్ కొడంగల్ లో గెలవలేదా..? అని అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడినవన్నీ అబద్ధాలే అని విరుచుకుపడ్డారు.

”BDL, BHEL, ఇక్రిశాట్ ఇచ్చింది ఇందిరమ్మ అనడం అబద్దం. ఆమె పోటీ చేయడానికి ముందే ఈ సంస్థలు వచ్చాయి. 1972 ఇక్రిశాట్ వచ్చిందనడం అవాస్తవం. 1970లో BDL, 1964లో BHEL వచ్చాయి. 1980లో ఇందిరా గాంధీ పోటీ చేశారు. అందరికీ అన్నం పెట్టింది మెతుకు సీమనే. ఆమె వచ్చిన తరువాతే పరిశ్రమలు వచ్చాయని అబద్దాలు ఆడుతున్నారు. మీరు మెదక్ వచ్చిన మాట్లాడిన మాటలు మీ కుర్చీ స్థాయిని తగ్గించాయి. 1980లో నన్ను గెలిపిస్తే రైలు ఇస్తామని ఇందిరా గాంధీ హామీ ఇచ్చారు. 40ఏళ్ల కలను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే నేను సిద్దిపేట రైల్వే స్టేషన్ ఏర్పాటు ప్రారంభం చేశాం.

కేసీఆర్ దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచుతామని రాహుల్ తో చెప్పించారు. 5 నెలల పాలనలో కేసీఆర్ దోచుకుంది ఒక్క రూపాయి అయినా బయటకు తెచ్చారా..? కేసీఆర్, మాల్లారెడ్డి తోడు దొంగలు అన్నారు. మరి మల్లారెడ్డి డీకే శివకుమార్ ని ఎందుకు కలిశారు? వేం నరేందర్ ఎందుకు కలిశారు? దొర, పటేల్ అని మాట్లాడుతున్నారు. ప్రధాని ఏం చేశాడో చర్చకు సిద్ధమా..? నేను ఒక్కడినే రమ్మంటే వస్తా.. సంగారెడ్డిలో BHEL చౌరస్తా వద్ద నిర్మాణం అవుతున్న 6 లైన్స్ రోడ్ చూడండి. తూఫ్రాన్ వరకు నిర్మాణం అవుతున్న ఫ్లైఓవర్ చూడండి. కూడవెళ్లి దేవాలయం.. ప్రసాదం పథకం కింద అభివృద్ధి చేశా. దుబ్బాక ప్రజలకు తెలుసు నేను ఎందుకు పోటీ చేశానో. రాజపుష్ప వద్ద పైసలు దొరికాయని డీజీ చెప్పారు కదా. మరి ఎందుకు వెంకట్రామి రెడ్డిని అరెస్టు చేయడం లేదు?

మెదక్ బీసీ బిడ్డ అని ప్రచారం చేస్తున్నారు. మెదక్ పార్లమెంటులో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 5 బీసీలకే ఇచ్చాము. ఇక్కడ లంకె బిందెలు లేవు ఖాళీ బిందెలు ఉన్నాయి అంటున్నారు.. మరి జీతం తీసుకుంటలేరా..? కేసీఆర్ ఉంటే 5వేలు వస్తాయి, కేసీఆర్ పోతే 15వేలు అన్నారు.. వచ్చాయా 15 వేలు..
కేసీఆర్ జైలుకే అన్నారు.. మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. మరి కేసీఆర్ ను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనా..? మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అడగడం లేదు.. 4వేలు పెన్షన్ అడుగుతున్నారు” అని రఘునందన్ రావు అన్నారు.

Also Read : వారు అందరూ బీజేపీలోకి వస్తున్నారు.. చివరికి రేవంత్ రెడ్డి కూడా వస్తారు: ఎంపీ అర్వింద్

 

 

ట్రెండింగ్ వార్తలు