హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. బావర్చీ బిర్యానీ తింటూ మాట్లాడుకుందామని హోటల్‌లో విద్యార్థుల వెయిటింగ్‌

రాహుల్‌ను విద్యార్థులు బిర్యానీకి ఆహ్వానించడం వెనుక పెద్ద కథే ఉంది.

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన వేళ ఆయన అశోక్‌ నగర్‌కు సమీపంలోని బావర్చీ హోటల్ వద్దకు రావాలంటూ కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ హోటల్‌కు వచ్చి తమతో బిర్యానీ తినాలని, నిరుద్యోగ సమస్యల గురించి చర్చించాలని అంటున్నారు.

రాహుల్‌ను విద్యార్థులు బిర్యానీకి ఆహ్వానించడం వెనుక పెద్ద కథే ఉంది. గత ఏడాది ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో అశోక్ నగర్‌లో నిరుద్యోగులను కలిశారు. విద్యార్థులకు ఆయన టీ తాగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.

అందుకే ఇప్పుడు ఆ హామీకి సమాధానం చెప్పాలంటూ కొందరు విద్యార్థులు బావర్చీ బిర్యానీ హోటల్‌కు ఆహ్వానిస్తున్నారు. బిర్యానీ తింటూ ఉద్యోగాల విషయం మాట్లాడుకుందామని అన్నారు. బావర్చీ హోటల్‌లో ఓ ఖాళీ కుర్చీని కూడా రాహుల్ గాంధీ కోసం వేసి, దానిపై ఆయన పేరును రాశారు.

కాగా, కుల గణన సంప్రదింపుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో సమావేశం అవుతారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఐడియాలజీ సెంటర్లో కులగణనపై పలువురి అభిప్రాయాలు తీసుకోనున్నారు, ఇందులో కుల, విద్యార్థి సంఘాలు, మేధావులతో రాహుల్ చర్చించనున్నారు.

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను: శరద్ పవార్ కీలక ప్రకటన