టైమ్‌ లేదని ఫుడ్‌ ఆర్డర్‌ ఇస్తున్నారా? తనిఖీల్లో నెల రోజులుగా దిమ్మతిరిగిపోయే దృశ్యాలు

Restaurants in Hyderabad: మనం ఇంట్లో వంట చేయాలంటే...కూరగాయలను రెండు,మూడు సార్లు కడుగుతాం. ప్యాకెట్‌లో ఉండే ఏ పదార్థాలనయినా..

హలో మేడమ్‌.. హలో జెంటిల్‌మెన్‌.. టైమ్‌ లేదని ఫుడ్‌ ఆర్డర్‌ ఇస్తున్నారా..? ఆకలి దంచేస్తుందని హోటల్‌కు వెళ్దామనుకుంటున్నారా..? ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌కి పెద్ద రెస్టారెంట్‌ వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటున్నారా..? ఐతే ఒక్కనిమిషం ఆగండి.. ఈ వార్త చూసి డిసైడ్‌ చేసుకోండి.. ఆరోగ్యం కోసం తినాలి అనుకుంటున్నారో..? లేదంటే రోగాలను కొని తెచ్చుకోవాడానికి వెళ్లాలి అనుకుంటున్నారో తేల్చుకోండి.. ఇదేమీ మేం చెబుతున్న మాట కాదు.. సాక్షాత్తు ఫుడ్‌ సేఫ్టీ అధికారుల బిగ్‌ అలర్ట్‌ ఇది.

గడిచిన నెల రోజులుగా హైదరాబాద్‌లో వరుసగా అధికారుల తనిఖీల్లో దిమ్మతిరిగి పోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.. పురుగులు పట్టి, పాడైపోయి, కుళ్లిపోయి, గడువు దాటిపోయిన ఆహారపదార్ధాలు ఒకవైపు.. ఏమాత్రం శుభ్రత లేని కిచెన్‌ మరోవైపు తనిఖీకి వెళ్లిన అధికారులకు సైతం వాంతి వచ్చేలా చేశాయి..

పురుగులు పట్టిన పిండి, గడువు తీరిన పాలప్యాకెట్లు, బూజు పట్టిన కూరగాయలతొ ఓ పక్క డ్రైనేజీ, మరో పక్క మూతలు లేని డస్ట్‌బిన్‌ల మధ్య వంట చేయడం, కాచిన నూనెతోనే పదే పదే వండడం, చికెన్ పేరుతో కుక్క, పిల్లి, ఇలా ఏది దొరికితే ఆ జంతువు మాంసం… వడ్డించడం, రెండు, మూడు రోజుల క్రితం వండిన బిర్యానీని ఫ్రిజ్‌లో పెట్టి..కస్టమర్లకు వేడి చేసి అందివ్వడం, డేట్ అయిపోయినా వినియోగదారులను ఏమార్చి బ్రెడ్, బిస్కెట్లు, చాక్లెట్లు అంటకట్టడం, ఘుమఘుమలాడే వాసనలు, ఆకర్షణీయ రంగులతో భోజన ప్రియులను ఆకర్షించి……ఇష్టానుసారం వండినవి..ప్లేట్లలో నోరూరించేలా అమర్చిఇవ్వడం…హైదరాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల్లో రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, ఐస్‌క్రీమ్ పార్లర్లు ఆడుతున్న కిల్లింగ్ ఫుడ్ గేమ్ ఇది.

మనది తినాలన్న కోరిక.. వారిది వ్యాపారం
మన ఆకలి, రకరకాల పదార్థాలు తినాలన్న కోరిక…వారికి వ్యాపారం. ఇందులో తప్పులేదు. ఆకలి తీర్చి..అన్నం పెట్టి…డబ్బులు సంపాదించుకోవడం నేరం కాదు. కానీ వారు చేస్తుంది సాధారణ వ్యాపారం కాదు. అక్రమం, అనైతికం.. చెప్పాలంటే ప్రజల ప్రాణాలలో చెలగాటమాడటం. నోరూరించే రుచులంటూ మనం ఆకర్షితులయ్యేలా చేసి….ఇష్టమొచ్చిన పదార్థాలను వడ్డించి..మనల్ని నేరుగా ఆస్పత్రుల బెడ్‌లపైకి చేరుస్తున్నారు.

రోగాలతో సాధారణ ప్రజలు అల్లాడిపోయేలా చేస్తున్నారు. షడ్రుచులను కడపునిండా తిన్నామని మనమనుకుంటున్నాం..నిజానికి మనమంతా తింటోంది కాలకూటవిషం. నమ్మలేకపోయినా ఇది నిజం. ఫుట్‌పాత్‌మీద టిఫిన్ సెంటర్ నడిపేవాళ్ల దుర్మార్గం కాదిది. పేరొందిన రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్ల దారుణం. అక్షరాలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఐస్‌క్రీమ్ పార్లర్లు. పేరేదైనా బయట ఆహారపదార్థాలు తిన్నామో అంతే సంగతులు అన్నట్లుగా మారాయి..

పూర్వపురోజుల్లో ఆహారాన్ని అమ్ముకునేవాళ్లని అంటరానివాళ్లుగా చూసేవాళ్లు. పూటకూళ్లవారు అని అవమానకరంగా మాట్లాడేవారు. కానీ తర్వాత కాలంలో ఆహారం అతిపెద్ద వ్యాపారంగా మారింది. ఫుడ్ బిజినెస్ లాభాల పంట పండిస్తోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేదు. దేశంలో ఎక్కడ చూసినా హోటళ్లు, రెస్టారెంట్లు, పిజ్జాహట్‌లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు జనాలతో కళకళలాడుతుంటాయి….ఏ సమయంలోనైనా కిటకిటలాడుతుంటాయి.

హైదరాబాద్‌లో అయితే ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ మూడు పూవులు, ఆరు కాయలు అన్న చందాన సాగుతుంటుంది. గంటగంటకూ, గల్లీగల్లీకో రెస్టారెంట్ ఓపెన్ అవుతుంటుంది. రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకొస్తుంటాయి. ఆ రెస్టారెంట్‌లో ఈ స్టార్టర్‌ బాగుంది… మరో రెస్టారెంట్‌ ఫిష్ బిర్యానీకి స్పెషల్ వంటివన్నీ ప్రచారం జరుగుతుంటాయి. జనం విరగపడిపోతుంటారు. కుటుంబ సమేతంగా రెస్టారెంట్లకు వెళ్లడం హైదరాబాద్‌లోనే కాదు చిన్న పట్టణాల్లో సైతం ట్రెండ్‌గామారింది.

అలవాటుగా బయటి ఆహారం
పుట్టినరోజు, పెళ్లిరోజు, పిల్లలకు ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు రావడం, ఆఫీసులో ప్రమోషన్ రావడం ఇలా సందర్భమేదైనా…బయటి ఆహారం తీసుకోవడం ఓ ఆటవిడుపుగా మారిపోయింది అందరికీ. ఇక దీంతో పాటు ఆరోగ్యస్పృహ బాగా తగ్గిపోయింది. సమయం లేకపోవడం, ఆఫీసు పనులతో ఆడవాళ్లు అలసిపోవడం, ఇంటిబాధ్యతలు పురుషులు పంచుకునే పరిస్థితులు కొన్ని ఇళ్లల్లో లేకపోవడం, ఇంటి ఆహారం రుచిగా లేదన్న అభ్యంతరాలు, రెస్టారెంట్ల తరహాలో రకరకాల ఫేవర్లతో ఇంట్లో వంట చేయడం కుదరకపోవడం…ఇలా రకరకాల కారణాలతో….బయటి ఆహారం తీసుకునేవారి సంఖ్య ఇటీవలికాలంలో ఊహించనంతలా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంటి వంట తినడం ఎంత సాధారణమో..ఇప్పుడు బయట ఫుడ్ తీసుకోవడం అంత సహజమైపోయింది.

నిజానికి పరిశుభ్రమైన వాతావరణంలో, తాజా పదార్థాలతో, కల్తీ లేని నూనెలతో తయారయ్యే వంటలు ఎక్కడ తిన్నా ఎలాంటి నష్టం ఉండదు. ఈ పరిస్థితులు ఉంటే..ఇంట్లో తిన్నా, బయటి తిన్నా తేడా ఉండదు. అసలు సమస్యల్లా…హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ మార్కెట్ల కక్కుర్తే. లాభాలను గడించేందుకో, ఉద్దేశపూరిత నిర్లక్ష్యమో తెలియదు కానీ.. ఫుడ్ మార్కెట్లన్నీ ఆహార తయారీ నియమనిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. నాణ్యత అన్నమాటకు చోటేలేదు.

మనం ఇంట్లో వంట చేయాలంటే…కూరగాయలను రెండు,మూడు సార్లు కడుగుతాం. ప్యాకెట్‌లో ఉండే ఏ పదార్థాలనయినా..డేట్ ఉంటా లేదా అని పదిసార్లు చెక్‌చేసుకుంటాం…వంటగదిని నిరంతరం పరిశుభ్రం చేసుకుంటాం. ఉదయం వండింది సాయంత్రం తినాలన్నా ఆలోచిస్తాం. రుచిలో కొంచెం తేడా వచ్చినా..ఏ మాత్రం వాసన అనిపించినా వెంటనే బయటపడేస్తాం. ఇంటి ఆహారంతో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా…రోగాల బారిన పడుతున్నాం.

మనం తీసుకునే ఆహారమే 56శాతం రోగాలకు కారణమని ICMR ఇటీవలే హెచ్చరించింది. ఇంట్లో ఇలాంటి ఆహారం తింటేనే రోగాలు చుట్టుముడుతుంటే..ఏ మాత్రం శుభ్రతలేని పరిస్థితుల్లో అసలేమాత్రం నాణ్యత లేని వస్తువులతో, కల్తీ ఆహారపదార్థాలతో వండే బయటి భోజనం మనల్ని ఏ స్థితికి చేరుస్తుందో అందరూ ఆలోచించుకోవాలి.

Bangalore Rave Party: వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించిన హేమ!

ట్రెండింగ్ వార్తలు