Rain in Telangana
Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. సోమవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతోపాటు.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఇవాళ, రేపు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Telangana Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ స్కీమ్ అమలుకు క్యాబినెట్ ఆమోదం.. ఇంకా
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దానికితోడు పశ్చిమబెంగాల్ నుంచి తూర్పు కోస్తాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అల్పపీడనం బలహీనపడిందని నేడు, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు.. జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సోమవారం సాయంత్రం ఉమ్మడి నల్గొండ, అదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో చేతికందే స్థితిలో ఉన్న వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు నేలవాలాయి. కుమురంభీ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిశాయి.
హైదరాబాద్ లో సోమవారం సాయంత్రంతోపాటు మంగళవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సుమారు గంటన్నరపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో నగర ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవాళ, రేపు కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండుమూడ్రోజులు ఈదురు గాలులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటలను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.