తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు

  • Publish Date - June 16, 2020 / 12:48 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారంతో పాటుగా మరో 5రోజులు వర్షాలు కురియనున్నట్లు ప్రకటించింది. చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాల వల్లే రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మంగళవారం మధ్యాహ్న సమయం నుంచి నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, కొమరం భీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసినట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. 

తెలంగాణ‌తో పాటు పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మధ్య ఉపరితల‌ ఆవర్తనం ఏర్పడింది. 

ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో  జూన్ 19న‌ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.