×
Ad

Raja Singh: ఆ తప్పు వల్లే ఇంత ఘోర అగ్నిప్రమాదం..! నాంపల్లి ఘటనపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

బిల్డింగ్ కడతారు, సెల్లార్ కడతారు, అందులో పార్కింగ్ ఉండదు, షాపులు పెడతారు.

Raja Singh: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరం అని అన్నారు. లోపల చిక్కుకుపోయిన వారి ప్రాణాలు కాపాడేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదంటే కనీసం ఇప్పుడైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలన్నారు. కమర్షియల్ బిల్డింగ్స్ ఓనర్లు, షాపుల ఓనర్లకు మీటింగ్ పెట్టాలన్నారు. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రాణాలను ఎలా కాపాడొచ్చు అనే దానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని రిక్వెస్ట్ చేశారు.

”ఇప్పుడు అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో సెట్ బ్యాక్ జీరో. డబుల్ సెల్లార్. నిండా సోఫాలే. ఈ ఒక్క షాపే కాదు.. అన్ని షాపుల్లోనూ ఇంతే. కమర్షియల్ కాంప్లెక్స్, ఫర్నీచర్ షాపుల ఓనర్లతో మీటింగ్ పెడితే మంచిది. ఓట్లు పోయినా పర్లేదు ప్రజల ప్రాణాలే ముఖ్యం. బేగంబజార్, నాంపల్లి, గుల్జార్ హౌస్, అబిడ్స్, కోటీ ఇదే పరిస్థితి. బిల్డింగ్ కడతారు, సెల్లార్ కడతారు, అందులో పార్కింగ్ ఉండదు, షాపులు పెడతారు. అధికారులు డ్రైవ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ అవినీతిమయంగా మారింది. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరక్కుండా నివారించేలా ఫైర్ సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి” అని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

”బిల్డింగ్ ని సెట్ బ్యాక్ లో కడుతున్నారో లేదో మున్సిపల్ కమిషనర్ చూడరు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేయరు. ఏమీ చూడకుండానే పర్మిషన్లు ఇచ్చేస్తారు. కనీసం ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేశారో లేదో చెక్ చేయాలి. ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారో లేదో చెక్ చేయాలి” అని రాజాసింగ్ అన్నారు.

 

 

మరోవైపు తమ పిల్లలు ఇంకా బిల్డింగ్ లోపలే ఉన్నారని చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ పిల్లలు ఏమయ్యారో తెలియక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో ఐదుగురు చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని అఖిల్, ప్రణీత్ గా గుర్తించారు. అఖిల్ వయసు 12 సంవత్సరాలు, ప్రణీత్ వయసు 8 సంవత్సరాలు.