రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేశారా? మీకు గుడ్‌న్యూస్‌.. మీ కల నెరవేరేది ఆ రోజే..

పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.

రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకున్న వారు శాంక్షన్ లెటర్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక విషయాలు తెలిపారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2 నుంచి శాంక్షన్ లెటర్లు అందజేస్తామని అన్నారు.

“తెలంగాణలోని యువతకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇప్పటికే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. 56వేలకు పైగా ఉద్యోగాల నియామక పత్రాలు అందించాం. మరిన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం.

ఉద్యోగాలు పొందలేని యువతకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చాం. రూ.9 వేల కోట్లతో దీన్ని ప్రకటించి, పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ప్రకటన నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చే వరకు క్యాలెండర్ ఇవ్వబోతున్నాం.

నోటిఫికేషన్ తేదీ, అప్లికేషన్ల తేదీలను ఇప్పటికే ప్రకటించాం. దరఖాస్తుల స్వీకరణను ఏప్రిల్‌ 14 వరకు పొడిగించాం. వాటన్నింటినీ పరిశీలించి ఎప్పటిలోగా పూర్తి కావాలో అధికారులకు చెప్పాం. సెలెక్ట్‌ అయిన వారికి జూన్‌ 2 నుంచి శాంక్షన్ లెటర్లు ఇస్తామని ప్రకటించాం. ప్రకటించినట్లుగానే వాటిని అందిస్తాం.

మండలాల వారీగా శాంక్షన్ లెటర్లు ఇస్తాం. జూన్ 9లోగా ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత వారు ఎంచుకున్న స్వయం ఉపాధి పథకానికి సంబంధించిన స్కీమ్‌కు ట్రైనింగ్‌ ప్రోగ్రాం కూడా నిర్వహిస్తాం. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టాం. రాష్ట్రంలోని యువత కోసం రాజీవ్ యువ వికాసాన్ని అందిస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని భట్టి విక్రమార్క అన్నారు.

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, వీటిలో ఏదైనా ఒకటి సరిపోతుంది. నిరుద్యోగ యువత ఈ పథకం కోసం ఏప్రిల్ 14 వరకు https://tgobmmsnew.cgg.gov.in/లో అప్లై చేసుకోవచ్చు.