Rajiv Yuva Vikasam Scheme
TG Rajiv Yuva Vikasam Scheme : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల స్వయం ఉపాధి కోసం రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తుంది. అయితే, ఈ పథకానికి భారీ స్పందన వస్తుంది. ఈనెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మొత్తం రెండు లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకంకు దరఖాస్తు చేసుకొనేందుకు ఏప్రిల్ 5వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది.
Also Read: తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో మళ్లీ కొత్త ట్విస్ట్‌లు.. ఏం జరిగిందంటే?
అర్హుల ఎంపిక ఇలా..
దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తయిన తరువాత ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లికేషన్లను అధికారులు పరిశీలిస్తారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు అర్హుల జాబితాను జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే21 నుంచి 31వ తేదీ వరకు యూనిట్లను మంజూరు చేస్తుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం చెక్కుల పంపిణీని ప్రారంభించనుంది.
గైడ్ లైన్స్ ఇవి..
♦ రాజీవ్ యువ వికాసం పథకంకు అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది.
♦ వ్యవసాయేతర పథకాలకు లబ్ధిదారుల వయసు 2025 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
♦ వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
♦ దరఖాస్తుదారులు ప్రతిపాదించిన యూనిట్ ధర ఆధారంగా వివిధ స్థాయిలో సబ్సిడీ ఉంటుంది.
♦ రూ.50వేల యూనిట్లను 100శాతం సబ్సిడీ
♦ రూ.50వేల నుంచి రూ. లక్ష మధ్య ఉన్న యూనిట్లకు 90శాతం సబ్సిడీ
♦ రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకు యూనిట్లకు 80శాతం సబ్సిడీ.
♦ రూ. 2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70శాతం సబ్సిడీ లభిస్తుంది.
♦ రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారు.
♦ ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.