తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో మళ్లీ కొత్త ట్విస్ట్‌లు.. ఏం జరిగిందంటే?
క్యాబినెట్ ర్యాంక్‌తో సమానమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులతో పాటు ఆర్టీసీ ఛైర్మన్ వంటి కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని చూస్తుందట.

తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో మళ్లీ కొత్త ట్విస్ట్‌లు. డైలీ సీరియల్‌ను మించిన ఎపిసోడ్‌లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక.. ముహుర్తం ఫిక్స్ అయ్యాక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఓవైపు జాబితా రెడీ అవుతుంటే, మరోవైపు తెలంగాణ నేతలు ఢిల్లీ వెళ్లి అధిష్టానం టేబుల్‌పై కొత్త అంశాలు, సమీకరణాలు పెడుతున్నారట. ఈ కొత్త ట్విస్ట్‌లతో కాంగ్రెస్ హైకమాండ్ డైలామాలో పడిందా.. ఇంతకీ క్యాబినెట్ విస్తరణను ఎలా డీల్ చేయబోతోంది. ఏం డిసైడ్ చేసింది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఆశావహులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నర కాలం నుంచి ఇదిగో ఫైనల్ లిస్ట్.. అదిగో ముహూర్తం అంటూ ఊరిస్తున్నారు తప్పా విస్తరణ జరిగింది లేదు. పదవులు ఇచ్చింది లేదు. విస్తరణకు ఏదో ఒక కొత్త చిక్కుముడి, ఏదో ఒక బలమైన కారణం అడ్డుపడుతూనే ఉంది.
తాజాగా ఉగాది తర్వాత క్యాబినెట్ విస్తరణ పక్కా అంటూ ప్రచారం ఊదరగొట్టారు. ఏప్రిల్ 3న కొత్త మంత్రులు ప్రమాణమంటూ తెగ సందడి చేశారు. ఇంతలో కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. ఆల్ ఆఫ్ సడెన్‌గా నేతల చర్యలతో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎస్సీ నేతకు తప్పకుండా మంత్రి వర్గంలో చోటు కల్పించాలని దళిత ఎమ్మెల్యేలు హైకమాండ్ లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా కలిసి వినతిపత్రాలు అందజేశారట.
దళిత సామాజికవర్గంతో లంబాడ సామాజికవర్గం ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగారు. మంత్రివర్గంలో ఎస్టీ సామాజికవర్గానికి అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఓటు బ్యాంకుతో 40 నియోజకవర్గాలను ప్రభావితం చేసే లంబాడ సామాజికవర్గానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన వారే కాకుండా ఇతర నేతలు సైతం క్యాబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నేతలు మల్‌రెడ్డి రంగారెడ్డి, దొంతి మాధవరెడ్డి, రామ్మోహన్ రెడ్డి వంటి నేతలు మంత్రిపదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దొంతి మాధవరెడ్డి ఏకంగా ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. లంబాడ సామాజికవర్గం నుంచి అవకాశం కోరుతూ మురళీనాయక్ సైతం ఢిల్లీ వెళ్లారు.
Also Read: విశాఖ పీఠం ఫైట్.. కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్
ఎవరి ప్రయత్నాలు వారివి
అలాగే మాదిగ సామాజికవర్గం నేతలు సైతం ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలను కలవాలని చూస్తున్నారు. వీరితో పాటు బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు సైతం తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కులగణన ద్వారా 56 శాతం బీసీ జనాభా తేలినందున మంత్రివర్గంలో కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత కల్పించాలని మెలిక పెడుతున్నారు. ప్రతీ క్యాబినెట్‌లో యాదవ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం దక్కేదని.. ఈ సారి కూడా అవకాశం ఇవ్వాల్సిందే అంటున్నారు. అలాగే మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి మంత్రి పదవి కావాలంటూ డిమాండ్ వినిపిస్తుందట.
ఇలా కొత్తగా సామాజిక సమీకరణాలు ఎఫెక్ట్ అడ్డుపడడంతో కాంగ్రెస్ అధిష్టానం సరికొత్త ఆలోచన చేస్తుందట. ప్రస్తుతం ఆరు బెర్తుల్లో నాలుగు లేదా ఐదు మాత్రమే భర్తీ చేయాలని డిసైడ్ అయ్యిందట. ఒకట్రెండు పోస్టులను ఖాళీగా ఉంచాలని భావిస్తోందట. అలాగే మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతరత్రా పదవులను కూడా ఇదే సమయంలో భర్తీ చేయాలని ఆలోచన చేస్తోందట అధిష్టానం.
క్యాబినెట్ ర్యాంక్‌తో సమానమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులతో పాటు ఆర్టీసీ ఛైర్మన్ వంటి కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని చూస్తుందట. దీనివల్ల ఆశావహులకు కూడా అవకాశం కల్పించినట్లు అవుతుందనే ఆలోచన చేస్తున్నారట హస్తిన పెద్దలు.
మొత్తం మీద రకరకాల ఈక్వేషన్స్‌తో క్యాబినెట్ విస్తరణ అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు ఢిల్లీ పెద్దలు ఒక ఆలోచనకువచ్చారు. మరి అధిష్టానం ఆలోచన ఏమేర ఫలిస్తుంది. ఈ సమస్య కొలిక్కి వస్తుందా లేదా అనేది ఏప్రిల్ 3 తర్వాత చూడాల్సిందే.