112 ఏళ్లు : రంజాన్ 1908లో అలా..2020లో ఇలా

రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ఎక్కడలేని సందడి నెలకొంటోంది. ముస్లిం సోదరులు ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి రోజు తప్పకుండా మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కఠోర ఉపవాస దీక్ష చేపడుతారు. ఉపవాసంలో మంచినీళ్లు కూడా తాగరు. ఇక రంజాన్ పండుగ వస్తుందని అనగా మార్కెట్లు కళకళలాడుతుంటాయి. రంజాన్ ఆరాధానలు, హాలీమ్ ఘుమఘుమలు, కొనుగోళ్లతో ఫుల్ బిజీగా కనిపించేది. కానీ ప్రస్తుతం అలాంటి వాతావరణం కనిపించడం లేదు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో అంతటా నిశబ్ద వాతావరణం నెలకొంది. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని చెప్పడంతో మసీదులు బోసిపోయి కనిపిస్తున్నాయి.

కానీ రంజాన్ మాసంలో కళ తప్పడం ఇది ఫస్ట్ టైమ్ కాదంటున్నారు విశ్లేషకులు. 1908లో ఇదే పరిస్థితి నెలకొంది. 1908 సెప్టెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయి. వరదల తాకిడికి ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. హైదరాబాద్ లో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నీ పొగొట్టుకున్న ప్రజల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ సమయంలోనే రంజాన్ మాసం వచ్చింది. వరదల అనంతరం అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని ముస్లింలు రంజాన్ ప్రార్థనలు ఇంట్లోనే జరుపుకోవాలని అప్పటి పాలకులు సూచించారు.

సర్వస్వం కోల్పోయిన వారికి పాలకులు ఆదుకొనే ప్రయత్నం చేసింది. వారికి ఆహార పదార్థాలు అందచేశారు. రంజాన్ మాసం ఇలాగే కొనసాగింది. కానీ ప్రస్తుతం పరిస్థితి వేరే విధంగా ఉంది. కరోనా వైరస్ భయంకరమైందని, ఒకరి నుంచి మరొకరికి సోకుతుండడంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోవాలని ప్రభుత్వాలు సూచించాయి. ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలన్నాయి. దీంతో ముస్లిం సోదరులు ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుతూ ఉపవాస దీక్షలను వదులుతున్నారు. ఈసారి హాలీం రుచి చూడలేమా అని నగర ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు.