Red Alert In Telangana Over Heavy Rains
Red Alert in Telangana over Heavy Rains : భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని తడిపి ముద్ద చేస్తున్నాయి. తెలంగాణలో కుమ్మేస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఎడతెరిపి లేని వాన.. రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తోంది. మరో రెండ్రోజుల పాటు.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ 14 జిల్లాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని పోలీస్‌శాఖ సూచించింది. గులాబ్ తుపాను మరింత బలహీన పడి వాయుగుండంగా మారింది. దీంతో ఉత్తర తెలంగాణ, పరిసర ప్రాంతాలలోని దక్షిణ ఛత్తీస్‌గడ్, విదర్భ ప్రాంతాల్లో వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. రామగుండానికి తూర్పు ఆగ్నేయ దిశగా 65 కిలోమీటర్ల దూరంలో.. భద్రాచలానికి ఈశాన్య దిశగా 125 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ – వాయువ్య దిశగా కదిలి మరింత బలహీనపడనుంది. దీంతో రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీలు చేసింది.
Cyclone Gulab: నేడు, రేపు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో అతిభారీ కుండపోత వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం నుంచి రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో 227 మిల్లీమీటర్ల అతిభారీ వర్షపాతం నమోదు అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 193 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. జయశంకర్ భూపాలపల్లిలో 172 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఉత్తర తెలంగాణ అన్ని జిల్లాల్లో 100 మిల్లీమీటర్ల కు పైగా అతిభారీ వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. పరీక్షలు వాయిదా
మరోవైపు.. గులాబ్ తుపాను ప్రభావంతో మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. పోలీసు, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. కలెక్టర్లతో సీఎస్ సమావేశమయ్యారు. అన్ని శాఖల అధికారులు అలర్ట్‌గా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇటు తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాల్సి ఉందని సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో సభా నాయకుడు, శాసన సభాపక్షనేతలను సంప్రదించిన అనంతరం సభాపతి, ప్రొటెం ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1న శాసనసభ, శాసనమండలి సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి.
Telangana Govt : గులాబ్ ఎఫెక్ట్.. రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం