Warangal Mirchi
Red Chilli : మిర్చి పంట ధరలు బంగారాన్ని తలపిస్తున్నాయి. బంగారం కంటే ఎక్కువగా ధర పలుకుతుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దేశీరకం మిర్చి క్వింటాల్ కు రూ. 52 వేలు పలికింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అని ఏనుమాముల మార్కెట్ అధికారులు వెల్లడిస్తున్నారు. బుధవారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 51 వేల 989గా ఉంది. మరో రూ. 11 అదనంగా దేశీ మిర్చి రేటు పలకడం విశేషం. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో క్వింటా ధర రూ. 52 వేలు అత్యధికంగా పలకడం గమనార్హం. రైతులకు వచ్చిన పంటలో నాణ్యత ఉన్న మిర్చికి మాత్రమే అత్యధిక ధర పలుకుతోంది. బుధవారం ఏనుమాముల మార్కెట్ కు 30 వేల మిర్చి బస్తాలు వస్తే… ఇందులో దేశీ రకం 800 బస్తాల వరకు ఉంది. ములుగు జిల్లా ఎస్ నగర్ కు చెందిన బలుగూరి రాజేశ్వర్ రావు తెచ్చిన ఏడు బస్తాల మిర్చికి క్వింటాల్ కు రూ. 52 వేల ధరను పెట్టి.. లాలా ట్రేడింగ్ కంపెనీ కొనుగోలు చేసింది. ఇక మిగిలిన రకాల మిర్చి రూ. 18 వేల నుంచి రూ. 35 వేల వరకు ధర పలికింది.
Read More : Telugu States: ఎర్ర బంగారం.. అన్నదాతకు సిరులు కురిపిస్తున్న మిర్చి!
కానీ.. ఎందుకింత రేటు పలుకుతోందని చర్చించుకుంటున్నారు. దీనికంతటికీ కారణం మిర్చి పంట ఉత్పత్తి చాలా తగ్గిపోవడం, తామర లాంటి తెగులుతో దిగుబడి పడిపోవడం కారణమంటున్నారు. అంతేగాకుండా ప్రస్తుతం పచ్చళ్లలో దీనిని ఎక్కువగా వాడుతుంటారని వెల్లడిస్తున్నారు. ఇప్పుడు సీజన్ కూడా తోడవడంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని, నాణ్యత ఉన్న మిర్చిని ఖరీదుదారులు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం జనవరిలో కురిసిన అకాల వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా తామర తెగులుతో వేలాది ఎకరాల్లో పంట నాశనమైందని తెలిపారు.
Read More : Telangana Rains : అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షాలు
ఈ మిర్చి పంట కొంతమంది రైతులకు లాభాలను తెప్పిస్తుంటే.. మరికొంతమంది రైతులకు తీరని నష్టాలను కలుగ చేస్తోంది. రూ. లక్షలు పెట్టబడి పెట్టినా పంట చేతికి రాకపోవడంతో కొంత సరుకుకు ఈ ధర వస్తోందని రైతులు వెల్లడిస్తున్నారు. పెట్టుబడి కూడా పూర్తిగా రావడం లేదని, తామర తెగులుతో పంట దిగుబడి తగ్గిందంటున్నారు. రూ. 5 లక్షలు పెడితే.. కేవలం రూ. లక్షా 70 వేలు మాత్రమే వచ్చాయని, దాదాపు రూ. 3 లక్షల 30 వేల వరకు నష్టోవాల్సి వచ్చిందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో దేశి మిర్చి క్వింటా ధర రూ. 28 వేలు ఉంటే… ఇప్పుడది రూ. 52 వేలతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని మార్కెట్ అధికారులు వెల్లడిస్తున్నారు.