Penna Cement Factory : నల్లొండ జిల్లాలో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ గనుల విస్తరణపై అవాంతరాల మధ్యనే ప్రజాభిప్రాసేకరణ కొనసాగుతోంది. దామరచర్ల మండలం గణేశ్ పహాడ్ శివారులో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. లగచర్ల ఘటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
అక్రమంగా తవ్వకాలు నిర్వహించారనే ఆరోపణలు..
నల్గొండ జిల్లా సూర్యాపేట సరిహద్దులో అదానీ కంపెనీ టేకోవర్ చేసిన పెన్నా సిమెంట్స్ పరిధిలో సున్నపు రాయి గనుల విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. 2022లో మైనింగ్ లీజు గడువు ముగిసినా.. అక్రమంగా తవ్వకాలు నిర్వహించారు అనే ఆరోపణ పరిశ్రమపై ఉంది. దాంతో కంపెనీపై పీసీబీ, ఎన్జీటీలకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో గనుల తవ్వకాలకు సంబంధించి అనుమతులు అధికారులు నిలిపివేశారు.
Also Read : ఆర్మూర్ నియోజకవర్గంలో వాల్ పోస్టర్ల కలకలం.. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిని ప్రశ్నిస్తూ 8 ప్రశ్నలతో పోస్టర్లు
లగచర్ల ఘటన నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను రద్దు..
అప్పటి నుంచి కూడా ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నించినప్పటికీ.. వివిధ కారణాలతో వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు రెండు సార్లు ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. లగచర్ల ఘటన తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంది. కానీ, లగచర్ల ఘటన నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేశారు.
లగచర్ల ఘటన తర్వాత మొదటి సారి నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయసేకరణగా చెప్పొచ్చు. లగచర్ల ఘటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ బందోస్తు, కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. మరో విధంగా చెప్పాలంటే పూర్తిగా నిర్బంధం అని చెప్పొచ్చు. ప్రజాభిప్రాయ సేకరణ అనేది ప్రజల మధ్య ప్రజలకు అందుబాటులో నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న తీరుపై స్థానికుల ఆగ్రహం..
అయితే, ఈ ప్రజాభిప్రాయ సేకరణను పరిశ్రమ లోపల.. మెయిన్ రోడ్ కు దాదాపు 2 కిలోమీటర్ల లోపల పరిశ్రమకు అనుబంధంగా ఉన్న నాలుగైదు చెక్ పోస్టులు దాటుకుని వచ్చిన తర్వాతే ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. సామాన్య ప్రజలు ఇక్కడికి చేరుకోవాలంటే దాదాపు నాలుగైదు చెక్ పోస్టులు దాటుకు వచ్చిన తర్వాతే ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉంది.
కనీసం దీనిపై ఇటు రెవెన్యూ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యంత్రాంగానికి చెందిన అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు ఈ ప్లేస్ ను ఎలా అనుమతించారని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారికి, పాజిటివ్ గా మాట్లాడే వారికి మాత్రమే లోనికి అనుమతిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
304 హెక్టార్లలో గనుల తవ్వకాల కోసం ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్ పహాడ్ పరిధిలో 303 హెక్టార్లు, సూర్యాపేట జిల్లాలో మరొక 100 హెక్టార్లకు సంబంధించి ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
Also Read : స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడంతో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం